BJP Vs Janasena : జనసేన పార్టీతో కలిసే పోటీ చేస్తున్నాం అధికారంలోకి వస్తున్నాం అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ప్రకటిస్తూంటారు. అలాగే జనసేన పార్టీ కూడా పొత్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తాము ఇంకా బీజేపీతోనే పొత్తులో ఉన్నామని చెబుతూ ఉంటారు. అంటే రెండు పార్టీల్లోనూ ఓ రకంగా ఇంకా తాము పొత్తుల్లోనే ఉన్నామన్న అభిప్రాయం ఉంది. కానీ అది క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. దానికి ఉదాహరణే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించకపోవడం. మర్యాదపూర్వకంగానైనా మద్దతు ఇవ్వాలని పవన్ ను అడగాలనే ఆలోచన బీజేపీ చేయలేదు. అడగనిదే ఎందుకు మద్దతివ్వాలని పవన్ కూడా మిత్రపక్షానికి ఓటేయాలని పిలుపునివ్వలేదంటున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ పోటీ - జనసేన దూరం !
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామని అటు బీజేపీ ఇటు జనసేన పోటీ పడ్డాయి. చివరికి బీజేపీ పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేశారు. అయితే ఫలితం ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదు. తర్వాత బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోవడం.. కుటుంబసభ్యులకే చాన్సివ్వడంతో పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేయదని ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం పోటీ చేసింది. పవన్ కల్యాణ్ మద్దతు తమకేనని ప్రచారం చేసుకున్నారుఆ పార్టీ నేతలు. ఇప్పుడు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కానీ జనసేన పార్టీ మద్దతు గురించి మాత్రం స్పందించడం లేదు. తమంతటకు తాముగానే ప్రచారం చేసుకుంటున్నారు.
వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన ప్రాచరం!
మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలనుకుంటున్న జనేసన పార్టీ.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి మాత్రం వేయవద్దు.. మీ ఇష్టం వచ్చినవారికి వేయండి అని పార్టీ సానుభూతిపరులకు నాదెండ్ల మనోహర్ సందేశం పంపారు. ఇదే పవన్ కల్యాణ్ సందేశం అని ప్రకటించారు. దీంతో రాజకీయ పార్టీల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ తాము పోటీ చేయకపోతే మిత్రపక్షం బీజేపీకి ఓటు వేయాలని ప్రకటన చేయవచ్చు కదా అనే సందేహం వారికి రావడమే దీనికి కారణం.
మర్యాద కోసమైనా పవన్ ను మద్దతు అడిగే ప్రయత్నం చేయని ఏపీ బీజేపీ నేతులు
ఎంత మిత్రపక్షం అయినప్పటికీ మద్దతు కోరడం సంప్రదాయం. ఏపీ బీజేపీ నేతలు ఇంత వరకూ పవన్ కల్యాణ్ మద్దతు కోరినట్లుగా స్పష్టత లేదు. ఆ మాటకు వస్తే ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఏ ఒక్క బీజేపీ నేత కలవలేదు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో పరిస్థితులు అంత గొప్పగా లేవు. వర్గాలుగా మారి విమర్శలు చేసుకుంటున్నారు. కొంత మంది పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఎక్కువ అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఆయన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం తిరుగుతున్నారుకానీ.. పవన్ ను కలిసి మద్దతు అడగాలనే ఆలోచన చేయలేదు. పవన్ మద్దతు అడగకపోవడంతో.. అడగకుండా మద్దతు ఇవ్వడం ఎందుకని పవన్ కల్యాణ్ కూడా సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి యువత నుంచి కూడా మద్దతు ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. పవన్ మద్దతిస్తే ప్లస్ అయ్యేది. కానీ ఆయన మద్దతు కోసం బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
పవన్ కల్యాణ్.. ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం లేదు. సందర్భాన్ని బట్టి ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు జనసేనను కలుపుకుని రాజకీయం చేద్దామన్న ప్రయత్నం చేయడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య బయట ప్రకటనల్లో చెబుతున్నంత గొప్పగా పొత్తు లేదని.. ఎవరికి వారే అన్నట్లుగా ఇప్పటికే విడిపోయారన్న భావం బలపడుతోంది.