2026 Andhra Settlers Vote Bank BRS:   ప్రాంతీయ సెంటిమెంట్ అవసరమైన ప్రతిసారీ ముందుండే బీఆర్ఎస్ అధినాయకత్వం  సీఆర్, కేటీఆర్, హరీష్ రావు  ప్రస్తుతం సాగుతున్న ఆంధ్రా నేతల పెత్తనం అనే వివాదంలో ఎక్కడా నేరుగా స్పందించడం లేదు. పార్టీ సోషల్ మీడియా విభాగాలు,  కొందరు పార్టీ సానుభూతిపరులైన  తెలంగాణవాదులు మాత్రమే క్షేత్రస్థాయిలో హడావుడి చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను తన సొంత బ్రాండ్ గా మార్చుకున్న ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ.. పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభ చుట్టూ ఇంత హంగామా జరుగుతున్నా అధికారికంగా తెర ముందుకు రాకపోవడం వెనుక పెద్ద పొలిటికల్ కాలిక్యులేషన్స్ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

 కవిత  టీఆర్ఎస్ పేరుతో డైరక్ట్ ఎటాక్

కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ అనే సరికొత్త పేరుతో రంగంలోకి దిగి పవన్ కల్యాణ్, చంద్రబాబులపై విగ్రహాల విధ్వంసం లాంటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్ సొంతం కాదని.. టీఆర్ఎస్ సొంతమని నిరూపించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు.  చిత్రంగా ఈ వివాదంలోకి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం వెనుక కాంగ్రెస్ మార్క్ ప్రాంతీయ వ్యూహం ఉంది. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ సెంటిమెంట్‌కు వారసురాలు కాదని, కాంగ్రెస్ కూడా ఇక్కడి ఆత్మగౌరవాన్ని కాపాడగలదని నిరూపించడమే పొన్నం వ్యూహం. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం ద్వారా అటు బీఆర్ఎస్ సెంటిమెంట్ మైలేజీని లాక్కోవడంతో పాటు, ఇటు తెలంగాణ పౌరుల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత పెంచాలనేది అధికార పార్టీ ఆలోచన. అందుకే పవన్ కల్యాణ్ ప్రెస్మీట్ పూర్తి కాగానే ..జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డిని రంగంలోకి దింపారు. 

Continues below advertisement

 గ్రేటర్ ఎన్నికల   ఆంధ్రా ఓటర్  భయం 

మరి ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ మెయిన్ లీడర్‌షిప్ ఎందుకు సైలెంట్‌గా ఉందంటే.. దానికి ప్రధాన కారణం ముంచుకొస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్   ఎన్నికలు. గ్రేటర్ పరిధిలో దాదాపు 30 శాతం కంటే ఎక్కువ మంది ఆంధ్రా మూలాలున్న ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేయడానికి ఈ సెట్లర్స్ ఓట్లే కీలకం అయ్యాయి. ఇప్పుడు గనక పవన్ కల్యాణ్ , చంద్రబాబును టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అధికారికంగా సెంటిమెంట్‌ను రగిలిస్తే, గ్రేటర్ లోని ఆంధ్రా ఓటర్లు పూర్తిగా హ్యాండ్ ఇస్తారని, అది కూటమి బీజేపీకి  లాభం చేకూరుస్తుందని కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.

 బ్రాండ్ కోల్పోయే ప్రమాదం ఉందా? 

గ్రేటర్ సీట్ల కోసం బీఆర్ఎస్ తన కోర్ సిద్ధాంతమైన  తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టడం ఒక రకమైన ఆత్మరక్షణ చర్యే. అయితే, ఈ అతి జాగ్రత్త వల్ల కాలక్రమేణా కరడుగట్టిన తెలంగాణవాదులు బీఆర్ఎస్ కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. పార్టీ మౌనంగా ఉండటం వల్లే కవిత లేదా కాంగ్రెస్ నేతలు ఆ స్పేస్‌ను ఆక్రమిస్తున్నారు. ఓ వైపు సెట్లర్స్ ఓట్లు పోకూడదు, మరోవైపు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గకూడదు అనే రెండు పడవల ప్రయాణంలో బీఆర్ఎస్ ఊగిసలాడుతోంది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ వివాదంలో బీఆర్ఎస్ తెరవెనుక ఉండి కేవలం సోషల్ మీడియా సైనికులతోనే నడిపిస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ బాస్.. సెంటిమెంట్‌ కంటే సీట్లే ముఖ్యమనే ప్రాక్టికల్ పాలిటిక్స్‌కు తెరలేపారు. మరి ఈ వ్యూహాత్మక మౌనం గ్రేటర్ లో బీఆర్ఎస్ ను గట్టెక్కిస్తుందో లేక కోర్ ఓటర్లను దూరం చేస్తుందో మున్ముందు తేలనుంది .