Congress Vs Janasena: హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ వివాదం తీవ్రమైన రాజకీయ యుద్ధానికి దారితీసింది. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటుగా స్పందించారు. పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తోందని మండిపడ్డారు. అవును.. తెలంగాణ మా తాతల, మా అయ్యా జాగీరే.. ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ - బీజేపీ స్క్రిప్ట్ పవన్ కల్యాణ్ రాజకీయంగా వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. "పవన్ కల్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర గనుక తగినంత డబ్బు ఉంటే.. నేను కూడా ఆయనకు ఒక పాత్ర ఇచ్చి, నా తరఫున మాట్లాడటానికి ఎంగేజ్ చేసుకునేవాడిని" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు ప్రెస్‌మీట్లలో వచ్చే చిట్టీలు బీజేపీ నుంచి వస్తున్నాయో, బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లలో ఎవరో ఒకరు ఆయనను ఆర్టిస్ట్‌గా ఎంగేజ్ చేసుకొని ఉంటారని, అందుకే బీజేపీ వాళ్లు ఇచ్చిన అసంపూర్ణ స్క్రిప్ట్‌ను పవన్ ఇక్కడ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో 2009, 2014 ఎన్నికల సమయంలో వచ్చిన జనం ఇప్పుడు కూడా ఒక నటుడిని చూడటానికి వస్తూ ఈలలు కొడుతుంటే.. ఆ క్రేజ్ అంతా తన రాజకీయ బలమే అనుకుంటే పవన్ పొరపాటేనని, సొంత రాష్ట్రమైన ఆంధ్రాలోనే సరిగ్గా గెలవలేకపోయిన ఆయన ఇక్కడికి వచ్చి ఏం పీకుతారని నిలదీశారు.
సామరస్య వాతావరణాన్ని గెలకవద్దు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తుంటే.. పవన్ కల్యాణ్ వచ్చి లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని పొన్నం మండిపడ్డారు. పవన్ గతంలో కొండగట్టు అంజన్న దర్శనానికి వస్తే.. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక అతిథిగా భావించి ప్రొటోకాల్ ఇచ్చి గౌరవించామని గుర్తుచేశారు. తెలంగాణకు రావడానికి, పోవడానికి పవన్‌కు ఎలాంటి అభ్యంతరాలూ లేవని, కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సభ పేరుతో గెలకడం సరికాదన్నారు. "తెలంగాణ మా అయ్యా జాగీరే.. నీ అయ్యా జాగీరు కాదు. ఇది ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం. ఆంధ్ర ప్రాంత ప్రజలను తెలంగాణ ఎప్పుడూ గౌరవిస్తుంది, హైదరాబాద్ ఒక ఫెడరల్ సిస్టమ్ లాంటిది, ఇక్కడ అన్ని భాషల వాళ్లూ ఉంటారు. కాబట్టి అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి గెలకవద్దు అని హెచ్చరించారు.
అంబేద్కర్, గద్దర్ ల ప్రస్తావనపై ఆగ్రహం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ప్రస్తావనను పవన్ కల్యాణ్ తీసుకురావడంపై మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాలపై మాట్లాడటానికి పవన్‌కు ఎంత ధైర్యం, ఎంత అహంకారం అని ప్రశ్నించారు. అలాగే ప్రజాయుద్ధనౌక గద్దర్ గారి గురించి పవన్ మాట్లాడిన తీరును అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారని.. తక్షణమే గద్దర్ ఆత్మకు పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లకు పనులు లేవని తాము ఎప్పుడూ అనడం లేదని, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గుజరాత్ లో పార్టీ పెట్టుకో - ఎవరికీ అభ్యంతరం లేదు
పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు చేయాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చని పొన్నం హితవు పలికారు. "నీకు అంతగా రాజకీయాలు చేయాలనిపిస్తే వెళ్లి గుజరాత్ లో పార్టీ పెట్టుకో.. ఎవరు వద్దన్నారు? కానీ తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు" అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినకుండా ఏడ్చిన వ్యక్తి, ఈరోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ నవనిర్మాణం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండి అక్కడ కూట్లో రాయి తీయలేనోడు.. ఇక్కడికి వచ్చి ఏట్లో రాయి తీస్తాననడం రాజకీయ నాటకమేనని పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
