India Mango Production Wall Street Journal report: సన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో భారతీయ మామిడి పండ్ల సువాసనలు గుబాళించాయి. భారతదేశానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆల్ఫాన్సో, కేసర్, చౌన్సా వంటి మామిడి రకాలను ఉచితంగా రుచి చూపించడానికి నిర్వహించిన ఒక వినూత్న  మ్యాంగో పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వందలాది మంది అమెరికన్లు, ప్రవాస భారతీయులు ఈ పండ్ల రుచిని ఆస్వాదించడానికి గంటల తరబడి పొడవైన క్యూ లైన్లలో నిలబడ్డారు.  

Continues below advertisement

అమెరికాను ఊపేస్తున్న  మ్యాంగో వైబ్స్ 

భారత సంతతికి చెందిన కమ్యూనిటీ లీడర్ దర్శిల్ ఆధ్వర్యంలో సన్‌ఫ్రాన్సిస్కోలో ఈ మామిడి పండగ ఘనంగా జరిగింది. ఇప్పటికే విజయవంతంగా నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ వార్షిక వేడుక, ఈసారి సోషల్ మీడియా సృష్టించిన హంగామాతో గ్లోబల్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్‌లో వందలాది మామిడి పండ్లను వాలంటీర్లు అక్కడికక్కడే ముక్కలుగా కోసి, వచ్చిన వారికి ఉచితంగా సర్వ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ యూజర్ జారెడ్ సీడెల్ షేర్ చేస్తూ..  నా జీవితంలో తిన్న అత్యంత అద్భుతమైన మామిడి పండ్లు ఇవే.. ఇక్కడి వైబ్స్ నెక్ట్స్ లెవెల్  అని ప్రశంసించారు.    

Continues below advertisement

భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం 

ఈ వైరల్ పోస్టులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయ మామిడి పండ్లను మ్యూనిటీ అంతా కలిసి ఆస్వాదించడంలో ఉండే మజానే వేరు.. సన్‌ఫ్రాన్సిస్కోలో వేసవి కాలానికి ఇంతకంటే మంచి ముగింపు ఉండదు  అని ఒకరు కామెంట్ చేయగా..  మామిడి పండ్ల కోసం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం రిజర్వ్ అయి ఉంటుంది అని మరొకరు భావోద్వేగంగా రాసుకొచ్చారు. అమెరికన్లకు భారతదేశపు అసలైన రుచులను పరిచయం చేయడమే కాకుండా, ప్రవాస భారతీయులు తమ స్వదేశీ జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి ఈ ఈవెంట్ ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది.  

 అమెరికా మార్కెట్ లో లగ్జరీ  ఐటమ్

భారతీయ మామిడి పండ్లకు అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పరిమిత కాలం మాత్రమే లభించే ఈ పండ్లు మార్కెట్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అమ్ముడవుతుంటాయి. అక్కడి మార్కెట్లో ఇవి అత్యంత ఖరీదైన లగ్జరీ  వస్తువులుగా పరిగణిస్తారు.  మామిడి పండ్లను అమెరికాకు చేర్చడం వెనుక ఒక పెద్ద శాస్త్రీయ ప్రక్రియ ఉంది. అమెరికా దిగుమతి నిబంధనలకు అనుగుణంగా, క్వాలిటీ , రుచి దెబ్బతినకుండా ఉండేందుకు ముంబైలోని ప్రత్యేక ప్లాంట్లలో ఈ పండ్లకు  గామా ఇరాడియేషన్   చేసిన తర్వాతే విమానాల్లో యూఎస్ మార్కెట్లకు తరలిస్తారు.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన గ్లోబల్ స్టాట్ 

ఈ ఈవెంట్ వైరల్ అవుతున్న తరుణంలోనే  ది వాల్ స్ట్రీట్ జర్నల్  నివేదికలోని ఒక ఆసక్తికరమైన గణాంకం అంతర్జాతీయ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం మామిడి పండ్లలో దాదాపు సగం వాటా భారతదేశానిదే. ఇండియా ఏటా సుమారు  20 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడిని ఉత్పత్తి చేస్తోంది. అయితే ఇందులో కేవలం  1 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. మిగిలిన 99 శాతం పండ్లను భారతీయులే స్వయంగా తినేస్తారనే వాస్తవం విని గ్లోబల్ ఆన్‌లైన్ కమ్యూనిటీ నోరెళ్లబెడుతోంది. సన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ మ్యాంగో సెలబ్రేషన్ కేవలం ఒక పండ్ల రుచిని చూపించే కార్యక్రమంగానే కాకుండా, భారతదేశపు సాంస్కృతిక రాయబారి గా నిలిచింది. పండ్ల రారాజైన మామిడికి ఉన్న అంతర్జాతీయ క్రేజ్ ఏంటో ఈ ఈవెంట్ మరోసారి నిరూపించింది.