Munugodu Polls :  మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచే అభ్యర్థి పదవీ కాలం ఎంత ? మామూలుగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. కానీ అది నేరుగా జరిగే ఎన్నికల్లోనే. అదే ఉపఎన్నికల్లో అయితే .. శాసనసభ ఎంత కాలం ఉంటుందో.. అంత కాలం మాత్రమే పదవి ఉంటుంది. ఈ ప్రకారం మునుగోడులో ఉపఎన్నికల్లో గెలిచే అభ్యర్థి పదవి కాలం కేవలం ఏడాది మాత్రమే. కానీ రాజకీయ పార్టీలు అలా అనుకోవడం లేదు. ఏడాది కోసం ఖర్చు అవసరమా అని అనుకోవడం లేదు. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. అభ్యర్థులు కూడా అంతే. ఈ ఉపఎన్నిక ఎందుకంత కీలకంగా మారింది ? వందల కోట్లు ముందూ వెనుకా చూసుకోకుండా ఎందుకు ఖర్చు  పెడుతున్నారు ?


మునుగోడు ఉపఎన్నికలో అత్యధిక ఖర్చు !


మునుగోడు ఉపఎన్నిక సాదాసీదా ఉపఎన్నిక కాదు. పదవీ కాలం ఎంత అనేది రాజకీయ పార్టీలు చూసుకోడం లేదు. జయలలిత చనిపోయిన తర్వాత ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కో ఓటుకు  రూ. ఇరవై వేల వరకూ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. అక్కడి డబ్బు ప్రవాహాన్ని చూసి ఈసీనే ఆశ్చర్యపోయి..చివరికి ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. మునుగోడులో కూడా ఆ స్థాయిలోనే డబ్బుల ప్రవాహం కనిపిస్తోంది అప్పట్లో  లేనంత ఆన్ లైన్ విప్లవం ఇప్పుడు ఉంది. అందుకే నోట్ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బులు పంచబోతున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రచారానికి.. పార్టీ నేతల్ని కొనడానికి.. ఖర్చు చేస్తున్నారు. ఓ ఉపఎన్నికలో ఈ స్థాయిలో ఖర్చు చేస్తారా అని అక్కడి జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. 


అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం !


మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉపఎన్నికను ప్రణాళిక ప్రకారం తీసుకు వచ్చిన  బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనుకుంటోంది. ఇక్కడ గెలిస్తే.. టీఆర్ఎస్ నేతలంతా పోలోమని తమ పార్టీలోకి వస్తారని.. ఒక్క సారిగా టీఆర్ఎస్ కు గెలుపు మూడ్ వస్తుందని నమ్ముతున్నారు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కూడా అంతే. బీజేపీది పైచేయి అయితే ఆ పార్టీని కంట్రోల్ చేయడం కష్టమని టీఆర్ఎస్ అధినేతకు తెలుసు. అందుకే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి  బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ప్లాన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా తాను కూడా ఓ గ్రామానికి ఇంచార్జ్‌గా ప్రకటించుకున్నారు. త్వరలో బహిరంగసభలు పెట్టబోతున్నారు. లోకల్ నినాదంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 


గెలిస్తే సెమీస్‌లో గెల్చినట్లే.. ఫైనల్‌లో అడ్వాంటేజ్ !


ఏడాది కూడా లేని పదవీ కాలానికి ఇంత ఎక్కువగా ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే.. ఓ రంకగా ఇది వచ్చే ఎన్నికలకు పెట్టుబడి అని ఆయా రాజకీయ పార్టీల నేతలు అనుకుంటున్నారు. మునుగోడులో గెలిస్తే.. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రమే కాదు..  ఓ వేవ్ తమవైపు ఉందని నమ్మకం కలిగించగలుగుతారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయాలు చేస్తున్నాయి. మునుగోడు ఓటర్లు కూడా ఉపఎన్నిక ఎందుకు వచ్చిందనే సందేహపడటం లేదు. ఎందుకొచ్చిన మన మంచికే అనుకుంటున్నారు. ఎందుకంటే.. రాజకీయ పార్టీలన్నీ కలిసి ఓ ఇంటికి ఖచ్చితంగా ఓ రూ. పాతిక వేలన్నా పంపిణీ చేస్తాయని వారికి నమ్మకం వచ్చేసింది.