Telangana News : మునుగోడు ఉపఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు టిక్కెట్ ఆశించి నిరాశకు గురైన బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్త్ తరుణ్ చుగ్‌, బండి సంజయ్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్న సమయంలో టీఆర్ఎస్ కీలక నేత  బీజేపీలో చేరేందుకు ఢిల్లీ రావడం .. ఆ పార్టీ నేతలను సైతం ఆశ్చర్య పరిచింది. 2014లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ .. టీఆర్ఎస్‌లో ప్రముఖ బీసీ నేతగా ఎదిగారు. 


భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ 


గత పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు వస్తాయేమోనని ఎదురు చూశారు. మునుగోడుకు ఉపఎన్నిక ఖరారైన తర్వాత ఆయన అక్కడ పోటీ చేయాలని ఆసక్తి ప్రదర్శించారు. మునుగోడు టిక్కెట్  బీసీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన తీరు పార్టీ నేతలకు అసంతృప్తి కలిగించింది. టిక్కెట్ కావాలంటే అడిగే విధానం అది కాదని..  బీసీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించారని పార్టీ పెద్దలు భావించారు. దీంతో ఆయనను దూరం పెట్టారు. అయితే మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆయనను ప్రగతి  భవన్‌కు పిలిపించి బుజ్జగించారు.భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆయన పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తామని ప్రకటించారు. 


టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలం


గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీ తరపున బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఉద్దృతంగా సాగింది. అయితే మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. అదే సమయంలో బూర నర్సయ్య గౌడ్ కూడా తాను తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికే పని చేస్తానని చెప్పారు. కానీ ఆయన మునుగోడుకు వెళ్లలేదు. టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల్లో కనిపించలేదు. టీఆర్ఎస్ నేతలు తనను దూరం పెడుతున్నారని అర్థం చేసుకున్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. 


మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్‌కు షాక్ !


మునుగోడులో బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి.ఈ కారణంగా ఆయన చేరిక ప్లస్ అవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోటీ చేయడానికి ఓ బలమైన అభ్యర్థి కూడా లబించినట్లు అవుతుందని బీజేపీ పెద్దలు భావించినట్లుగా తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలకు ముందు ఇలా బీసీ నేత పార్టీని వీడటం టీఆర్ఎస్‌కు గట్టి షాక్ లాంటిదేనని భావిస్తున్నారు.