మోహన్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర లేని పేరు. విలన్ గా సినీ కెరీర్ మొదలు పెట్టి  ప్రముఖ హీరోగా ఎదిగారు. దర్శకుడు దాసరి నారాయణ రావు అండదండలతో భక్తవత్సలం నాయుడు కాస్తా.. మోహన్ బాబు అయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో అద్భుత నటుడిగా అవతరించారు. ఒకప్పుడు ఆయన సినిమా విడుదల అవుతుందంటే ప్రేక్షకుల సంతోషానికి హద్దులు ఉండేవి కాదు. ఊర్లకు ఊర్లే సినిమా టాకీసుల ముందు వాలిపోయేవి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు కట్టుకుని సినిమా చూసేందు పట్టణాలకు పయనమయ్యేవాళ్లు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. టాలీవుడ్ లో ఆయన సినిమాలు సాధించిన కనక వర్షంతో ‘కలెక్షన్ కింగ్’ గా మారిపోయారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో పాటుగా మోహన్ బాబు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు చేయడం తగ్గించారు. అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. 


పొగిడితే సెల్ఫ్ డబ్బా అంటారు!


ఆయన పిల్లలు కూడా సినిమా రంగంలో అడుగు పెట్టారు. మంచు లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్ పలు సినిమాల్లో నటించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ సాలిడ్ హిట్ తగల్లేదనే చెప్పుకోవచ్చు. గతేడాది జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకొని ఏడాది అయిన సందర్భంగా మంచు విష్ణు ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసిన పనుల కంటే గొప్పగా మంచు విష్ణు పని చేస్తున్నాడని ప్రశంసించారు. ఇదే సమయంలో పొగిడితే సెల్ఫ్ డబ్బా అంటారని కామెంట్ చేశారు. చేసిన పని చెప్పుకోవడంలో తప్పులేదన్నారు.   


Also Read: డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అంజలి ఎంట్రీ, ‘ఝాన్సీ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!


చేసిన పని చెప్పుకోవడం సెల్ఫ్ డబ్బా కాదు!


“రమణ మహర్షి గారు చెప్పినట్లు ఎన్ని దుర్గుణాలున్నాయో వాటన్నింటీన కలబోసి ఒక మిషన్ లో వేస్తే తయారయ్యే వాడే మనిషి అన్నాడాయన. నరులకు నిలువెల్లా విషమే అన్నారు. అలాగే, ఓటమిని సహించలేక.. ఎవరు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. వాళ్లు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుడున్నాడు. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలా చేయలేదు. ఇలా మీటింగులు పెట్టలేదు. ఇలా ఎప్పుడూ డిన్నర్లు ఇవ్వలేదు. చాలా మంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు అంటుంటారు. భారత, భాగవత రామాయణంలో చూసుకుంటే.. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు సీతా దేవి దగ్గర.. అమ్మా.. నేను వంద మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినయంగా చెప్పాడు. అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్లిన తర్వాత ఇతడికి కుర్చీ వేయాల్సిన అవసరం లేదంటే.. నేను ఎంతగొప్ప వాడినో చూపిస్తాను అని చెప్పి లంకా దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినయంగా ఉండాలి? ఎక్కడ విశ్వరూపం చూపించాలి? ఆయనకు బాగా తెలుసు. అలాంటప్పుడు మనం ఏం చేశామన్నది పది మందికి తెలియజేయడం అనేది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. ఏమీ చేయకుండా చేశానని చెప్పుకోవడం సెల్ఫ్ డబ్బా. చేస్తున్నాం అని చెప్పనప్పుడు. చేసి చూపిస్తున్నప్పుడు అది సెల్ఫ్ డబ్బా కాదు” అని మోహన్ బాబు తెలిపారు.