When KTR CM :  కాబోయే సీఎం కేటీఆర్ అనే  డైలాగ్ తెలంగాణ మంత్రుల వద్ద నుంచి తరచూ వస్తుంది. ఇలాంటి ప్రకటనలు చేయాలంటే.. ఆషామాషీగా చేయరు. వారికేదో సంకేతాలు వస్తేనే చేస్తారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదే ప్రకటన చేశారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అదే ప్రకటన చేశారు. తెలంగాణ‌కు కాబోయే సీఎం కేటీఆర్ అని, రాష్ట్రానికి స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు ఆయ‌న‌ని తీర్పిచ్చారు.  కేటీఆర్ హ‌యాంలో పెద్దపెద్ద ఇండ‌స్ట్రీస్ తెలంగాణ‌కు వ‌స్తున్నాయ‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా ఉపాధి అవ‌కాశాలు ఇక్క‌డ ల‌భిస్తున్నాయ‌న్నారు. ఆయ‌న మా నాయ‌కుడు కావ‌డం మా అదృష్టంగా భావిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ప్రకటించేశారు. 


మంత్రుల ప్రకటనలు వ్యూహాత్మకమేనా ?


తెలంగాణ మంత్రుల ప్రకటనలు వ్యూహాత్మకమేనని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేటీఆర్ సీఎం అనే మాట గత ఐదారేళ్లుగా వినిపిస్తూనే ఉంది. గత ముందస్తు ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్లీనరీ సందర్భంగా అదే ప్రచారం జరిగింది. అయితే ముందస్తు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కేటీఆర్ సీఎం కాలేదు. గత ఏడాది టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా కేటీఆర్ సీఎం అనే ప్రకటనలు చేశారు. కొన్ని రోజులు దీనిపై చర్చ జరిగిన తర్వాత కేసీఆర్ ఆ అంశంపై మాట్లాడవద్దని ఆదేశించడంతో సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు కేటీఆర్ సీఎం అనే వాదనను తెరపైకి తీసుకు వచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. 


ముందస్తు ఎన్నికలుంటాయా ? కేటీఆర్‌ను సీఎంను చేస్తారా ?


తెలంగాణలో కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ నవంబర్, డిసెంబర్‌లోనే  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా అది ముందస్తు ఎన్నిక కాబోదు. ఓ ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లినట్లవుతుంది. ఈ అంశంపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుంది. ఒక వేళ అసెంబ్లని రద్దు చేయకపోతే.. కేటీఆర్ ను సీఎం చేసి..  కేటీఆర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా కొంత కాలంగా బీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. 


కేటీఆర్‌కు బాధ్యతలిచ్చి జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెడతారా ?


బీఆర్ఎస్  చీఫ్ కేసీఆర్ తనకు జాతీయ రాజకీయాలు ఓ టాస్క్ అని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు కావొచ్చు.. ఇతర కారణాలు కావొచ్చు కానీ బీఆర్ఎస్ పై పూర్తి స్తాయిలో దృష్టి పెట్టలేకపోతన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. పర్యటించాల్సి ఉంటుంది. సీఎంగా ఉంటూ పూర్తి స్థాయిలో అలా చేయడం కష్టమవుతుంది. అందుకే కేసీఆర్ సీఎం బాధ్యతల్ని కేటీఆర్ కు ఇచ్చి తాను జాతీయ  రాజకీయాలపై దృష్టి  పెట్టవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై అవగాహనకు రావడంతోనే మంత్రులు కేటీఆర్ సీఎం అనే ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు యాధృచ్చికంగా చేస్తున్నారా లేకపోతే వ్యూహాత్మకంగా చేస్తున్నారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే  అవకాశం ఉంది.