అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో సినిమా నటులు ఎక్కువ సన్నిహితంగా ఉంటారు. కారణం ఏమిటో తెలియదు కానీ వైఎస్ఆర్‌సీపీతో నటులే కాదు టాలీవుడ్‌కు చెందిన చాలా మంది దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది నటులు ఆ పార్టీ కోసం పని చేశారు. థర్టీ ఇయర్స్ ఫృథ్వి దగ్గర నుంచి నటుడు కృష్ణుడు వరకూ చాలా మంది ప్రచారం చేశారు. మోహన్ బాబు అయితే నేరుగా పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇదంతా చరిత్ర . ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ కోసం ఎవరు ప్రచారం చేస్తారా అని చూస్తే.. ఎవరూ కనిపించడం లేదు.
వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేసిన వారికి జరగని మేలు !
వైఎస్ఆర్‌సీపీ గెలుపునకు అహర్నిశలు శ్రమించిన నటులు ఒక్కొక్కరికగా వైసీపీకి దూరమవ్వడం సంచలనంగా మారింది. 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోహన్ బాబు, జయసుధ, జీవితారాజశేఖర్, తనీష్, కృష్ణుడు వీరంతా ఒక్కొక్కరిగా పార్టీకి దూరమయ్యారు. స్వయానా బంధువు అయిన మోహన్ బాబు అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేనే లేదు. ఇకపోతే జీవితారాజశేఖర్ ఏకంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జయసుధ కూడా వేరే పార్టీకి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక టిక్కెట్ దగ్గర్నుంచి రాజ్యసభ వరకూ అన్ని పదవులూ ఆశ చూపిన అలీకి ఇప్పటికీ ఏమీ దక్కలేదు. చివరికి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లనే కాదు వారి కుటుంబాలను కూడా బండ బూతులు తిట్టి తన జగన్ భక్తికి అంతు లేదని నిరూపించుకునన పోసానికీ చాన్స్ రాలేదు. దీంతో ఇప్పుడు వీరంతా వైఎస్ఆర్‌సీపీకి పని చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
సానుభూతిపరులు కూడా బయటకు చెప్పడం లేదు !
జగన్ కు హీరో నాగార్జున ఆప్తమిత్రుడు. ఈ విషయాన్ని నాగార్జునే ప్రకటిచారు. అయితే ఆయన కూడా జగన్ తరపున ప్రచారం చేసే అవకాశం లేదు. ఆయన వైసీపీలో చేరుతారని.. విజయవాడ నుంచి పోటీ చేస్తారని అప్పుడప్పుడూ ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జున అంత రిస్క్ తీసుకోరని అంటున్నారు. ఇక ఫృథ్వి విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్‌సీపీని ఘోరంగా విమర్శిస్తున్నారు. నిజానికి వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారెవరూ బహిరంగంగా చెప్పలేకపోతున్నారు.
సినీ ఇండస్ట్రీతో విరోధం !
వైఎస్ఆర్‌సీపీకి సినీ ఇండస్ట్రీకి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో చెడిందని అంటున్నారు. రాజకీయంగా దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించాయని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. మెగా అభిమానులు దాదాపుగా వైసీపీకి దూరమై.. జనసేనకు దగ్గరయ్యే పరిస్థితికి చేరుకుంది. నందమూరి అభిమానులు టీడీపీకి మరింత దగ్గరయ్యారని చెబుతున్నారు. సినీ పరిశ్రమకు.. వైఎస్ఆర్‌సీపీ హయాంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొందని.. ఆ పార్టీని ఇక ఎవరైనా అభిమానించలేరని టాలీవుడ్లోని కొన్ని వర్గాలు చెబుతూ ఉంటాయి.
స్టార్ క్యాంపెయినర్ల కోసం వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నం !
వచ్చే ఎన్నికల్లో సినీ పరిశ్రమ నుంచి ఒకరిద్దరైనా స్టార్ క్యాంపెయినర్లు ఉండేలా చూసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎవరన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఇక ముందు ఇద్దరు, ముగ్గురికి పదవులు పంపకం చేయాలని భావిస్తున్నారు. అలీ, పోసానిలకు మంచి నామినేటెడ్ పోస్టులు ఇస్తారన్నప్రచారం జరుగుతోంది. వారి ద్వారా ఆర్టిస్టుల్ని వైఎస్ఆర్‌సీపీ ప్రచారానికి ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. మరి ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి !