Who are TDP ministers in Anantapur district :    రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని నమోదు చేశారు. ఎవరు ఊహించని మెజార్టీ స్థానాలు రాష్ట్రంలో రావడంతో పార్టీ అభ్యర్థులే కాదు ఆ పార్టీల అధినేతలు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ మంత్రి వర్గ కూర్పు పార్టీ అధినేతకు సవాల్ గా మారింది. 175 కు 164 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు  విజయం సాధించారు.  


ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ 


ఉమ్మడి అనంతపురం జిల్లాను కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.  14 నియోజకవర్గాలకు గానూ 14 నియోజకవర్గాలోనూ అభ్యర్థులు విజయం సాధించారు. 13 స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవగా ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. వీరిలో ఐదుగురు కమ్మ సామాజిక వర్గం నుంచి గెలుపొందారు. మరో ఐదుగురు బీసీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 


మంత్రి పదవులు ఎవరికి ?


ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎవరు మంత్రివర్గంలో ఉంటారనేది జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ముందుగా ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉండేది.  రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఉరవకొండలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఓడిపోవాలి అలా అయితేనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ బలంగా ఉండేది.  ఆ సెంటిమెంట్ ను ప్రస్తుతం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బద్దలు కొట్టారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందారు . రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది.  దీంతో ఈసారి కచ్చితంగా అధినేత చంద్రబాబు క్యాబినెట్లో పయ్యావుల కేశశ్‌కు  మినిస్టర్ బెర్త్  కన్‌ఫర్మ్ అవుతుందని  భావిస్తున్నారు. 


సునీత కూడా రేసులో !


ఇదే జిల్లాలో మరో సీనియర్ లీడర్ మాజీ మంత్రి పరిటాల సునీత కూడా రాప్తాడు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు.  2014 ఎన్నికల్లో కూడా రాప్తాడు నుంచి గెలిచిన మాజీ మంత్రి పరిటాల సునీతకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత పనిచేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కూడా రాప్తాడు నుంచి పరిటాల సునీత గెలవడంతో చంద్రబాబు క్యాబినెట్లో మరోసారి మంత్రిగా అవకాశం లభిస్తుందని చర్చ కొనసాగుతోంది.  


బీసీ వర్గాల నుంచి కాలవ  శ్రీనివాసులు


మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ ఉంటాడు. ప్రస్తుతం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గం నుంచి 40000 పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా రాయదుర్గం నుంచి గెలుపొందిన కాలువ శ్రీనివాసులకు చంద్రబాబు క్యాబినెట్లో హౌసింగ్ మంత్రిగా పనిచేశారు సామాజిక వర్గాల నేపథ్యంలో కాలువ శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కే విధంగా కనిపిస్తోంది. 


బీజేపీకి కేబినెట్‌లో చోటు కల్పిస్తే సత్యకుమార్ రేసులో ! 


కూటమి లో భాగంగా ధర్మవరం నుంచి బీజేపీ నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్య కుమార్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సా బీజేపీకి కేబినెట్‌లో అవకాశం కల్పిస్తే మాత్రం జాతీయ స్థాయిలో పేరు ఉన్న సత్యకుమార్‌కు చంద్రబాబు కేబినెట్‌లో చోటు దకే అవకాశం కనిపిస్తోంది. పెనుగొండ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన  కురుబ సవితమ్మ కూడా ఈ సారి చంద్రబాబు క్యాబినెట్‌లో అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు.  మరో వైపు అదే సామాజిక వర్గానికి చెందిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా మంత్రుల రేసులో ఉన్నారు. ఎవరెవరికి చోటు లభిస్తుందనేది పన్నెండో తేదీన తేలిపోయే అవకాశం ఉంది.