Botcha Denied transfers Scam Allegations : టీచర్ల బదిలీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బదిలీల కోసం బొత్స లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్న అంశంపై ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖ పరిధిలో గతంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం, దరిమిలా దానిపై ఆరోపణలతో పత్రికలు వార్తాంశాలు ప్రచురించాయన్నారు. తనపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన వార్తాంశాలు పూర్తిగా అవాస్తవం, అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు ముందే క్లారిటీ ఇచ్చానన్న బొత్స
ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించాయని గుర్తు చేశారు. అప్పుడే ఖండించిన విషయాలను మీకు గుర్తు చేస్తున్నాను.ఇప్పుడు మరోసారి ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాననన్నారు. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే అప్పట్లో నిర్ణయం తీసుకోవడమైందన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సిందిగా సంబంధిత అధికారులను తానే స్వయంగా కోరడం జరిగిందన్నారు.
వైసీపీ ఓడిపోయినందున తానే బదిలీల్ని ఆపాలని చెప్పానన్న బొత్స
ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వస్తున్నందున ఈ విషయంలో వారు తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం అర్జీచేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది కొత్త ప్రభుత్వం ఇష్టం. వాస్తవాలు ఇలా ఉంటే బదిలీలకోసం లంచాలు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం మాకు లేవని చెప్పుకొచ్చారు. దాదాపుగా పదిహేను వందల మంది ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు బదిలీలు చేపట్టారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తన నగదు తీసుకన్నారని ఆరోపణలు వస్తున్నాయి.
బదిలీల విషయంలో ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు
వైసీపీ ఓడిపోవడంతో మంత్రిగా బొత్స పదవి కూడా పోయింది. అయితే బదిలీలు మాత్రం జరగలేదు. దీంతో డబ్బులు ఇచ్చిన ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవతుున్నారు. డబ్బులు ఇచ్చినా బదిలీలు జరగలేదని ధర్నాకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అందరూ బొత్స సత్యనారాయణ వైపే చూస్తున్నారు. దీంతో ఆయన .. బదిలీలు జరగలేదని.. అందులో తప్పేమీ లేదని అంటున్నారు.