Atmakur Elections : ఆత్మకూరులో ఉప ఎన్నిక జరగబోతోంది. అధికార పార్టీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో దిగుతున్నారు. మేకపాటి గౌతంరెడ్డి మరణించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల ఇరవై మూడో తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఇప్పుడు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారన్న చర్చ ప్రారంభమయింది. వైఎస్ఆర్‌సీపీ తరపున మేకపాటి కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డి పేరును గతంలోనే ఖరారు చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు ఉంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
తాము పోటీ చేస్తామంటున్న బీజేపీ !
తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. అయితే అభ్యర్థి ఎవరు అన్నదానిపై స్పష్టత లేదు. బరిలో ఏ ఇతర పార్టీ లేకపోతే.. ఆత్మకూరులో కాస్త పట్టు ఉన్న ఎవరో ఓ నేత వస్తారన్న అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే భారతీయ జనతాపార్టీ తమ మిత్రపక్షం జనసేనతో సంప్రదింపులు చేయకుండానే ఈ ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ వచ్చిన ఉపఎన్నికల్లో బీజేపీనే పోటీ చేస్తూ వస్తోంది. తిరుపతి పార్లమెంట్ స్థానం, బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీనే పోటీ చేసింది. బద్వేలులో ముందుగానే జనసేన పోటీ లో ఉండటం లేదని ప్రకటించింది. అయితే బీజేపీ బరిలో ఉండటంతో ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది.
ఇంకా స్పందించని జనసేన !
ఇప్పుడు ఆత్మకూరులో జనసేన పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పొత్తు ధర్మం ప్రకారం సోము వీర్రాజు.. జనసేనతో చర్చలు జరిపి ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఒక వేళ జనసేన పోటీకి సిద్ధంగా ఉంటే ఆ పార్టీ వాదనను కూడా పార్టీ హైకమాండ్‌కు వివరించాల్సి ఉంది. అయితే ఇక్కడ తామే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించడంతో జనసేన ఏం చేస్తుందన్నది ఇంకా స్పష్టత రాలేదు.
టీడీపీ సంప్రదాయాన్ని ఫాలో అవుతుందా ?
టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే పోటీ చేయని సంప్రదాయం ఉంది. టీడీపీ దాన్ని పాటిస్తోంది. అయితే ఇప్పుడు మేకపాటి గౌతంరెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలనుకుంటే ఈ కారణం చూపించే అవకాశం ఉంది. అలాగే .. సానుభూతితో పోటీ చేయకపోతే.. పారిపోయారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో అయినా పోటీ చేయక తప్పని పరిస్థితి ఉందన్న చర్చ టీడీపీలో ఉంది. మహానాడులో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భారీ మెజార్టీపై వైసీపీ కన్ను !
తమ పాలనపై వ్యతిరేకత ఉందని విపక్షాలు ప్రచారం చేస్తున్నందున ఆత్మకూరులో భారీ మెజార్టీ సాధించి.. అందరికీ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్‌సీపీ పట్టుదలగా ఉంది.