CM Jagan Name in YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొదటి నుండి ఏపీ రాజకీయాల్లో సంచలనమే. సీబీఐ విచారణ ఆగుతూ సాగుతోంది. మధ్యలో సుప్రీంకోర్టు ఆలస్యమవుతోందని దర్యాప్తు అధికారిని మార్చారు. అయితే ఇప్పుడు కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించింది. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారని ముందుగా తెలిసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి కంటే చాలా ముందుగానే సీఎం జగన్‌కు తెలుసని అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా ఓ సీఎంపై సాదాసీదాగా ఇలాంటి అఫిడవిట్లను సీబీఐ దాఖలు చేయదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
సీఎం జగన్‌ను సీబీఐ ప్రశ్నిస్తుందా ?
ఈ కేసులో ఇప్పటి వరకూ సీఎం జగన్ గురించి సీబీఐ ఎలాంటి ప్రస్తావన తీసుకు రాలేదు. తొలి సారి ఆయన పేరును ప్రస్తావించారు. అది కూడా విస్తృతమైన కుట్రను వెలికి తీసే క్రమంలో .. చేస్తున్న దర్యప్తులో భాగంగా ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. అంటే వైఎస్ వివేకాను హత్య చేసిన తర్వాత పీఏ కృష్ణారెడ్డి ఉదయమే వచ్చి చూడక ముందే అసలు హత్య జరిగిపోయిందని బయట కొంత మందికి తెలిసింది. అదేలా అన్నది ఇప్పుడు సీబీఐ తేల్చాల్సి ఉంది. అలా జరిగిందని తెలిసిన వారే కుట్ర దారులు కావొచ్చన్న అనుమానాలు సహజంగానే దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తాయి. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజీనామాకు విపక్ష నేతలు డిమాండ్ చేసే అవకాశం !
సీఎం జగన్ పేరు కౌంటర్ అఫిడవిట్‌లో ఉండటంతో విపక్ష పార్టీ నేతలు సీఎం జగన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. సొంత బాబాయ్ హత్య కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని ఇప్పటికే వైఎస్ సునీత సహా పలువురు ఆరోపించారు. అందుకే కోర్టుకు వెళ్లి సీబీఐ కి కేసు వెళ్లేలా చేశారు. ఇప్పుడు నేరుగా సీఎం పేరును సీబీఐ కూడా ప్రస్తావించడంతో ఆయనపై మరింత ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ సీబీఐ ఆయనను ప్రశ్నించడానికి నోటీసులు ఇస్తే రాజీనామాకూ పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ అధికారులు ఈ విషయంలో ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ తో కోర్టులో గట్టి వాదనలు వినిపిస్తారన్నది ఏపీ రాజకీయాల్లోనూ కీలక పరిణామాలకు కారణయ్యే అవకాశం ఉంది.
సీబీఐ అఫిడవిట్‌పై వైఎస్ఆర్‌సీపీ స్పందన ఎలా ఉంటుంది ?
సీబీఐ అఫిడవిట్‌పై జగన్ తరపు లాయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని దీని వెనుక కుట్ర ఉందని చెప్పినట్లుగా మొదట్లో ప్రచారం జరిగింది. అయితే తర్వాత న్యాయపరమైన అంశం కావడం.. కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కావడంతో.. ఆ స్పందనను వెనక్కి తీసుకున్నారు. న్యాయపరంగా ఏం చేయాలన్నదానిపై ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ సీఎంపై ఆషామాషీగా ఇలాంటి ఆరోపణలు చేయదని.. భావిస్తున్నారు. అందుకే ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ ఏర్పడుతోంది.