Raja Singh News: తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు బయటపడింది. మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న అంతర్గత పోరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక టైంలో పీక్స్‌కు చేరింది. ఏకంగా గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవేవీ ఒకట్రెండు వారాల్లోజరిగినవి కావు. చాలా కాలంగా నలుగుతున్న ఆధిపత్య పోరుకు ఇది పరాకాష్టగా చెబుతున్నారు రాజకీయ నిపుణులు. రాజాసింగ్ చేసిన చర్యలు పార్టీలో సుదీర్ఘకాలంగా నడుస్తోన్న కలహాలకు సూచనగా విశ్లేషిస్తున్నారు.
అధ్యక్ష పదవి దక్కలేదన్న కోపంతోనా?రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ పార్టీ సీనియర్ నేతల్లో రాజాసింగ్ ఒకరు. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన నేతల్లో ఆయన ఒకరు. అయితే, ఈ నియామక విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ముందుగా తాము అనుకున్న వ్యక్తులకే ఓ వర్గం నేతలు అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. "వారు అనుకున్న వాళ్లనే అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నారు" అని రాజాసింగ్ నేరుగా అధినాయకత్వాన్ని తప్పుబట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చానని, తనకు ముగ్గురు మద్దతు ఉందని, మరో ఏడుగురు కమలం నేతలు సంతకం చేయాల్సి ఉందని, కానీ తనకు మద్దతుగా సంతకం చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరించారని, నామినేషన్లు కూడా దాఖలు చేయనివ్వలేదని రాజాసింగ్ చెప్పడం ఆసక్తిగా మారింది. రాజాసింగ్ వ్యాఖ్యలు పరిశీలిస్తే, పార్టీలో ఓ వర్గం కేంద్ర, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభావితం చేసి తమకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారని స్పష్టంగా చెప్పడం గమనించాల్సిన విషయం.
పార్టీలో కుట్రదారులు ఉన్నారా...?గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలోని కొందరు నేతలపై విరుచుకుపడుతూనే ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా చాలా కుట్రలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. "కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఇస్తే బీజేపీని బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెడతారు" అంటూ సొంత పార్టీ నేతలపై ఆరోపణలు సంధించారు. మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా పని చేసేవారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేస్తున్నారని రాజాసింగ్ మండిపడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇక తాజాగా, పార్టీ అధికారంలోకి రావద్దని కొందరరు సీనియర్ నేతలు కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ చెప్పడం మరో కోణం. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ లోపలనే అంతర్గత శత్రువులు ఉన్నారని, పార్టీని ఎదగకుండా, అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారని స్పష్టంగా చెబుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఆరోపమలతో బీజేపీలో అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేంద్ర నాయకత్వం చోద్యం చూస్తుందా?రాజాసింగ్ గత కొద్ది కాలంగా చేస్తోన్న వ్యాఖ్యలు అటు రాష్ట్ర నాయకత్వాన్ని, ఇటు పార్టీ హైకమాండ్‌ను తప్పుబట్టేలా ఉన్నాయి. పార్టీకి నష్టం చేస్తున్న వారిపై కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పదేపదే ఆయన విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. తనను అధ్యక్ష పదవికి పోటీ పడకుండా తన మద్దతుదారులను రాష్ట్ర నాయకత్వంలోని ఓ వర్గం బెదిరించినా, కేంద్ర నాయకత్వం చోద్యం చూస్తుందన్న భావనలో రాజాసింగ్ ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఓ వర్గంపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నుంచి గతంలో సస్పెండ్ చేశారు.
తర్వాత రాజాసింగ్‌ను పార్టీలోకి తీసుకున్నా సరైన ప్రాధాన్యతివ్వడం లేదన్న భావనలో రాజాసింగ్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చెబుతున్న విషయాలను కేంద్ర నాయకత్వం గుర్తించడం లేదని అంటున్నారు. హిందూ వర్గ నేతగా పార్టీకి తాను చేసిన సేవలు గుర్తించలేదన్న అసంతృప్తిలో రాజాసింగ్ ఉన్నట్లు అర్థం అవుతుంది. పలుకుబడి ఉన్న వారికి తప్ప తన లాంటి నేతలకు, నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదన్న భావనను పలుసార్లు రాజాసింగ్ మీడియా తెలియజేశారు.
రాజాసింగ్ రాజీనామా రాష్ట్ర నాయకత్వ వైఫల్యమేనా?గత కొద్ది రోజులుగా రాజాసింగ్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు కలుగజేసుకోలేదన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఒకవేళ ఆయన్ని బుజ్జగించి ఉంటే, పార్టీకి రాజీనామా చేసే వరకు వ్యవహారం వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజాసింగ్ పార్టీలో సీనియర్ నేత, పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. అలాంటి ఎమ్మెల్యేను పక్కన పెట్టడం రాజకీయంగా పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మరింత బలాన్ని పుంజుకుని లక్ష్య సాధన దిశగా నడవాల్సిన కమలం పార్టీ, ఓ ఎమ్మెల్యేను దూరం చేసుకోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక ఎమ్మెల్యేను బుజ్జగించడంలో ఎందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోతే కేంద్ర నాయకత్వం రాజాసింగ్ విషయంలో జోక్యం చేసుకోలేదన్న చర్చ సాగుతోంది.
ఏది ఏమైనా రాజాసింగ్ రాజీనామా వ్యవహారం పార్టీలోనూ, తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు నెలకొందన్న వార్తలను ఈ రాజీనామా స్పష్టం చేస్తోంది. రాజాసింగ్ వంటి నేతను బుజ్జగించి పార్టీ లైన్లో నడిపించేలా చేయడంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. ఆ క్రమంలో బీజేపీ రాజాసింగ్ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తుంది? రాజాసింగ్ పార్టీకి దూరమయ్యాడా లేక పార్టీనే రాజాసింగ్‌ను దూరం పెట్టిందా? రానున్న రోజుల్లో కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో బీజేపీ ప్రయాణం ఎలా ఉంటుంది? అన్న విషయాలు అర్థం కావాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే.