Madhav election as AP BJP president will be a formality: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనే అభ్యర్థి అని...హైకమాండ్ సమాచారం పంపడంతో ఆశావహుల్లో ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. రాయలసీమ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పార్థసారధి, సుజనా చౌదరి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. మాధవ్ ఎన్నికయిన అధికారిక ప్రకటన మంగళవారం విడుదల కానుంది.
పొకల వంశీ నాగేంద్ర మాధవ్ కుటుంబం మొదటి నుంచి బీజేపీతో అనుబంధం కలిగి ఉంది. మాధవ్ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో ప్రారంభించారు. ఆ తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో విశాఖ నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఉమ్మడి కార్యదర్శిగా పనిచేశారు. స్వదేశీ జాగరణ్ మంచ్‌లో పూర్తి సమయం కార్యకర్తగా భారతదేశం అంతటా పనిచేశారు. 2003-2007 మధ్య భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2007-2010 మధ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010-2013 మధ్య జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2009లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2017లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. 2023లో అదే నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం కావడానికి మాధవ్ నాయకత్వం కీలకం కానుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ ఇమేజ్‌ను ఉపయోగించి సభ్యత్వ డ్రైవ్‌ను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైనదని భావిస్తున్నారు. బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీవీఎన్ మాధవ్ మంచి ప్రతిభ చూపిస్తారు. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఇంకాచెప్పాలంటే బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత మాధవ్.
బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీవీఎన్ మాధవ్ మంచి ప్రతిభ చూపిస్తారు. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఇంకాచెప్పాలంటే బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత మాధవ్.