ఏపీలో వీఆర్వోల తీరు అనేక విమర్శలకు తావిస్తోంది.. విలేజ్ రివిన్యూ ఆఫీసర్లుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీరిలో చాలా మందికి డిపార్ట్‌మెంట్ పనుల్లో పట్టులేకపోవడమే కాదు.. కనీస అవగాహన, అక్షర జ్ఞానం లేకపోవడం కనిపిస్తోంది.. అయితే దీనికి ఒక మందును కనిపెట్టారు సదరు వీఆర్వోలు.. పని రాకపోయినా పైరవీల్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు ఒక్కొక్కరు ఒరరిద్దరు అసిస్టెంట్లను మెయింటినెన్స్ చేస్తూ వారితో పనులు చేయించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారట.. ఇదే పరిస్థితి ఏపీ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఒకరిద్దరు అసిస్టెంట్లను మెయింటినెన్స్ చేయడం కనిపిస్తోందంటున్నారు.
వారికి నెల నెలా జీతాలు ఇచ్చిమరీ తమ పనులు చక్కబెట్టించుకుంటుండగా చాలా మంది వీరికి ఈపనులన్నీ అప్పగించి సొంత పనులు, సెటిల్‌మెంట్లలో బిజీ బిజీగా గడుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. విచిత్రమేంటంటే వీరిలో చాలా మంది కారుణ్యనియామకాల క్రింద వచ్చిన వారే అధికంగా ఉంటుండగా కొందరు గ్రామ సహాయకులుగా పనిచేస్తూ ప్రమోషన్లు మీద వీఆర్వోలుగా వచ్చి కనీస అవగాహన లేకుండా అసిస్టెంట్లతో పనులు చక్కబెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
బల్లకింద చేయిపెట్టి.. చేతి తడిపితేనే..
గ్రామస్థాయిలో భూ సంబందమైన ఏ పనులు కావాలన్నా వీఆర్వోలే అత్యంత కీలకం. ఇదే అదనుగా పత్రీ పనికి బల్లకింద చేయిపెట్టి మరీ ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు పలువురు వీఆర్వోలపై వస్తున్నాయి. ప్రధానంగా భూ సంబందిత మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్‌లు, ఇళ్ల పట్టాల పునరుద్దరణ, ఫ్రభుత్వ భూముల్లో పట్టాల జారీ ఇలా ఒక్కటేంటి దశ దారుల్లో దోపిడీ పర్వానికి తెగబడుతున్నారన్న ఆరోపణలు చాలా మంది వీఆర్వోలపై వస్తున్నాయి. అంతే కాకుండా తహసీల్దార్‌లను సైతం ఏమార్చి అడ్డగోలుగా రికార్డుల్లో మార్పులు చేసి ఆపై పత్రాలు సృష్టిస్తున్నారని బయట పడ్డ పలు కేసులను బట్టి అర్ధం అవుతుందంటున్నారు. గ్రామస్థాయిలో రికార్డు అంతా సిద్ధం చేసి ఆపై తహసీల్దార్ సంతకం కోసం ప్రయత్నించే క్రమంలో తహసీల్దారులు కొన్ని సమయాల్లో లోపాలను చూడకుండా సంతకాలు చేస్తే వారు ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయంటున్నారు. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలంలో పనిచేసిన ఓ మహిళా తహసీల్దార్ ఓ వీఆర్వో చేసిన కక్కుర్తి పనికి ఆమె బలై జైలుపాలయ్యింది.
అడ్డగోలు పనులకు అసిస్టెంట్లు..
గ్రామాల్లో ఉంటూ రెవిన్యూ సంబందిత సమస్యల పరిష్కారానికి, ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ పని ఓ చోట, నివాసం మరో చోట ఉండడమే కాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం తమ కింద అనధికార అసిస్టెంట్లను నియమించుకుని ఆపై వీరు బయట పనుల్లో ఉంటున్నారని చాలా మంది వీఆర్వోల విషయంలో ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయిలో భూ సంబందిత రికార్డుల నిర్వహణకు వీఆర్వోలే కీలకం కాగా అడ్డగోలు పనులకులంచాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న కొందరు రివిన్యూ రికార్డుల పనుల్లో అనధికారికంగా అసిస్టెంట్లను ఉపయోగించుకుని మరీ పలు అక్రమాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. కొందరు అయితే తమ కింద పనిచేసే వీఆర్‌ఏలను మీడియేటర్లుగా ఉపయోగించుకుంటూ వసూళ్ల పర్వానికి పాల్పడుతుండగా మరికొందరు అయితే తమ కింద అనధికారికంగా నియమించుకున్న అసిస్టెంట్లను ఉపయోగించుకుని మరీ లంచాలు దండుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు. కారుణ్య నియామకం కింద వీఆర్వోలుగా ప్రమోషన్లు పొందిన వారు కొందరు సచివాలయాల్లో ఉండకుండా ప్రయివేటు పనుల్లో నిమగ్నమవ్వడం, తమ కింద అసిస్టెంట్లు చేత అనధికారికంగా పనులు చక్కబెట్టించుకోవడం కనిపిస్తోంది. ఇది ఎక్కువగా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్ మండలాల్లో కనిపిస్తోంది. అల్లవరం మండలంలో అయితే కారుణ్యనియామకం కింద ఉద్యోగం పొంది ఆపై వీఆర్వోలుగా పదోన్నతి పొందిన సుమారు ఆరు గ్రామాల్లోని కొందరు వీఆర్వోలు అసిస్టెంట్లును పెట్టి అడ్డగోలు పనులకు తెరతీస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వీరు చేసే అడ్డగోలు పనులను ప్రశ్నిస్తే మండల స్థాయి అధికారులను సైతం తమ పైరవీలతో భయపెట్టే స్థాయిలో ఉన్నారని, పలు ఉదాహరణలు చెబుతున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో తీరులోనే..
ఇటీవలే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన పరసా శ్రీమన్నారాయణ అనే ఒక వీఆర్వో ఓ రైతు వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు వలకు చిక్కాడు.. దొరికితేనే దొంగ.. లేకుంటే అందరూ దొరలే అన్న చందంగా కొందరి వీఆర్వోల పరిస్థితి కనిపిస్తోందని పలువురు రైతులు బాహాటంగా విమర్శించారు. దీనికి కారణం భూ సంబందిత మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు ఇలా ఏ పనికోసం వెళ్లినా కొందరు లంచాల ఆకలిని తీర్చలేక నానా అగచాట్లు పడుతున్నామని మండిపడుతున్నారు. లంచం ఇవ్వకుంటే ఉద్దేశ్యపూర్వకంగా మోకాలడ్డుతున్నారని, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పఇకైనా జిల్లా ఉన్నతాధికారులు కొందరు వీఆర్వోల పనితీరుపై నిఘా పెట్టి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.