Munugode Telangana Politics :  మునుగోడు ఉపఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఎదురుదాడికి దిగిన పార్టీలు ఇక ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ డిఫెన్సివ్ ఆడిన పార్టీలు దూకుడుగా మారే అవకాశం ఉంది. ఉపఎన్నికల ఫలితాలతో సంబంధం లేదు.. ఇక ఫైనల్స్‌లో చూసుకుంటామని కొన్ని పార్టీలు చెలరేగిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు అన్ని పార్టీల రాజకీయ వ్యూహాలు మారిపోనున్నాయి. 


టీఆర్ఎస్ దూకుడు పెంచే అవకాశం !


మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్ టెన్షన్‌లో ఉంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. దీన్ని టీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలే్కపోయారు. అదే సమయంలో బీజేపీ వైపు నుంచి అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేనా..  ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో నేరుగా కేసీఆర్ కుమార్తె కవితపైనే ఢిల్లీ స్థాయిలోనే అవినీతి ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల మధ్య మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ సవాల్‌ను స్వీకరించాలనే అనుకుంది. రాజగోపాల్ రెడ్డి ఇలా రాజీనామా చేయడం.. అలా ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి. మొదట్లో  నెమ్మదిగా ప్రారంభించినా చివరికి వచ్చేసరికి టీఆర్ఎస్ ధాటికి బ్యాటింగ్ చేసింది. ఈ ఫలితం ఓట్ల రూపంలో కనిపించింది. ఇప్పుడు టీఆర్ఎస్‌కు తిరుగులేనంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే టీఆర్ఎస్ ఇక నుంచి డిఫెన్సివ్ రాజకీయాలు కాకుండా ఎదురుదాడి రాజకీయాలు చేయనుంది. ఇప్పుడా పార్టీ చేతిరోల ఫామ్ హౌస్ ఫైల్స్ కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగట్టడానికి చాన్స్ ఉంది. 


వ్యూహాలను సమీక్షించుకోక తప్పని పరిస్థితుల్లో బీజేపీ !


తెలంగాణలో అధికారం చేపట్టబోతున్నామన్న గొప్ప నమ్మకంతో నిన్నటి వరకూ బీజేపీ ఉంది. కానీ ఇవాళ ఆ నమ్మకం సడలిపోయింది.  ఖచ్చితంగా గెలిచి తీరుతామని తెచ్చి పెట్టుకున్న ఉపఎన్నిక మొత్తానికి దెబ్బకొట్టేసింది. ఇప్పుడు .. పార్టీపై ఈ ఓటమి ప్రభావం ఎక్కువగానే కనిపించనుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అంతా.. మైనస్ అవుతుంది. హుజూరాబాద్‌లో గెలిస్తే మరో ఒకటో .. రెండో ఉపఎన్నికలు తీసుకొద్దామని వేసుకున్న ప్రణాళికలన్నీై ఇక నిలిపివేయక తప్పదు. టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టి... ఏదో చేయాలనుకునే రాజకీయం ఇక వర్కవుట్ కాకపోవచ్చు. నేరుగా ఫైనల్స్ కోసం ప్రజల వద్దకు వెళ్లడమే బీజేపీ చేయగలిగిన పని. మధ్యలో ఏదైనా ఉపఎన్నికల లాంటి రాజకీయం చేస్తే బెడిసికొట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఉన్న బీజేపీ రాజకీయంలో దూకుడు తగ్గే చాన్స్ ఉంది. 


కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొదటి నుంచి ప్రారంభించాల్సిందే !


గతమెంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. ఆ పార్టీకి ఉన్న బలం.. బలహీనత రేవంత్ రెడ్డే. ఆయన మాస్ లీడర్. కేసీఆర్ తర్వాత జనాల్లో ఎక్కువ ఆదరణ ఉన్నది రేవంత్ రెడ్డికే. అయితే ఆయనకు కాంగ్రెస్‌లోనే మైనస్‌లు ఉన్నాయి. వాటిని అయన అధిగమించలేకపోతున్నారు. ఆయన ముందుకు అడుగు వేస్తే సీనియర్లు వెనక్కి లాగుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేలా.. సీనియర్లను పక్కన పెట్టేసి.. ఒంటి చేత్తో పార్టీని లాగడం ప్రారంభించడమో..లేకపోతే సీనియర్లంతా కలిసి పని చేయకపోతే మొదటికే మోసం వస్తుందని గుర్తించడమో చేయాల్సి ఉంటుంది. ఆ రెండింటిలో ఏదీ చేయకపోయినా..కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితే.