రోడ్లు రావు, మోరీలు రావు, అభివృద్ధి జరగదు అంటూ బెదిరించినా కూడా ప్రజలు అభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యమని బీజేపీకి ఓట్లు వేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, మునుగోడు ప్రజా స్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు అన్నారు. కేసీఆర్ నమ్ముకున్న డబ్బు మద్యానికి కాలం చెల్లిందని, రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగిస్తుంది అనడానికి మునుగోడులో బీజేపీ శ్రేణుల పోరాటం నిదర్శనమని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి మునుగోడులో ఓడిపోతే, పార్టీ భవిష్యతే ప్రశ్నార్ధకమవుతుంది అని భావించి ఆయనతో సహా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను రంగంలోకి దించారని అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే, రేపు బీజేపీకి అవకాశం ఉండదు అని హుకుం జారీ చేసి అధికారులందరినీ చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ అడుగులకి మడుగులు వత్తే విధంగా పని చేయించారని విమర్శించారు. బీజేపీ నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించి, దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు.
మద్యం ఏరులై పారించారు, పెన్షన్ రద్దని బెదిరించారు
రాష్ట్ర పరిపాలన గాలికి వదిలిపెట్టి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మునుగోడులో తిష్ట వేశారని.. ఇతర పార్టీల నాయకులను, బీజేపీ నేతల్ని ప్రచారం చేయకుండా దౌర్జన్యం చేశారని చెప్పారు. బీజేపీ పోలింగ్ ఏజెంట్లను ప్రలోభ పెట్టారని... సిబ్బందిని సైతం భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు పోలీసు వాహనాల్లో తీసుకువచ్చి ప్రజలకు పంచిపెట్టారని, వందల లారీల లిక్కర్ తీసుకువచ్చి మునుగోడులో మద్యాన్ని ఏరులై పారించడం ప్రజాస్వామ్యాయా అని అడిగారు.
‘మహిళా సంఘాలకు, గొల్లకురుమలకు బ్యాంకులో డబ్బులు వేశారు. పెన్షన్లు వేస్తామని అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు. స్వయంగా మంత్రులే టిఆర్ఎస్ కి ఓటు వేయకపోతే పెన్షన్ రద్దు అయిపోతుంది అని బెదిరించారు. ప్రచారం అయిపోయిన తర్వాత అందరూ మునుగోడు నుంచి బయటికి వెళ్లాలి. కానీ ఒక్క టిఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే అక్కడే ఉన్నారు. పలివెల గ్రామంలో నా భార్య అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే రాత్రి 11 గంటలకు బయటికి పంపించారు. అర్ధరాత్రి మహిళను ఎలా పంపిస్తారు అన్న కూడా వినకుండా బయటికి పంపించి టీఆర్ఎస్ నేతల్ని మాత్రం యథేచ్ఛగా పోలింగ్ అయ్యే వరకు తిరగనిచ్చారని చెప్పారు. అభ్యర్థి పోలింగ్ సరళిని పరిశీలిస్తుంటే శివన్నపేట, చండూరు ప్రాంతాల్లో దాడులు చేశారని’ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
మంత్రుల చెంప చెళ్లుమనిపించారు !
మునుగోడులో ధర్మం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందన్నారు. తమకు టెక్నికల్ గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు. కానీ మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా ఓటర్లు బీజేపీకి ఓట్లు వేసి వారి చెంప చెళ్లుమనిపించారని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం పనిచేయదు అని, కేసీఆర్ నైతికంగా ఓడిపోయినట్లు మునుగోడు ప్రజలు నిరూపించారని చెప్పారు. హుజురాబాద్, దుబ్బాకలో చెప్పిన కూడా కేసీఆర్ కు ఇంకా ఇంకా జ్ఞానోదయం కాలేదన్నారు. మునుగోడులో కూడా డబ్బులు, మద్యంతో ప్రలోభపెట్టాలని అదే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో కూడా బీజేపీ ఈ స్థాయికి రావడం గొప్ప పరిణామం అన్నారు. ఈరోజు ఒక్క నియోజకవర్గం కనుక సీఎం కేసీఆర్ దబాయించి పనిచేశారని, రేపు జనరల్ ఎలక్షన్‌లో ఈ పరిస్థితి ఉండదన్నారు ఈటల రాజేందర్.