Telangana Congress Future : మునుగోడు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడింది. ఏ ఉపఎన్నికల్లోనైనా కాంగ్రెస్‌కు డిపాజిట్లు తెచ్చుకోవడం గగనం అయిపోతోంది. ఒక్క నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది. కానీ అక్కా చతికిలపడిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా.., ఓడిపోయిన తర్వాత ఎన్ని రకాల కారణాలైనా చెప్పుకోవచ్చు.. కానీ వాట్ నెక్ట్స్ అనేది ముఖ్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఓ పజిల్‌గా మారిపోనుంది.
తెలంగాణ ఇచ్చి తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తి ఓ సారి కాకపోతే.. ఇంకో సారి అధికారంలోకి వచ్చేది. కానీ రెండు రాష్ట్రాలను విడగొట్టాలని .. అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్న తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ చతికిలపడిపోయింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడంతో క్యాడర్ అంతా ఆ పార్టీ వైపు వెళ్లింది. అదే సమయంలో రాష్ట్రం విడగొట్టిన సెంటిమెంట్ కూడా కలవడంతో ఇక కాంగ్రెస్‌కు ఏపీలో ఉనికి లేకుండా పోయింది. కనీసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా .. తెలంగాణలో అయినా తిరుగులేని శక్తిగా మారుదామనుకుంటే.. ఏ మాత్రం కలసి రావడం లేదు. అంతకంతకూ బలహీనమైపోతోంది . బీజేపీ కొత్త ఉత్సాహంతో ముందుకు వచ్చింది కానీ .. కాంగ్రెస్ వెనుకబడిపోయింది.
అంతర్గత కుమ్ములాటలతో గెలిచే సీట్లలోనూ ఓటమి
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్ గెలిస్తే.. ఫలానా నేత సీఎం అవుతాడు.. తాము ఎందుకు కష్టపడాలని ఇతర నేతలు అనుకోవడం.. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అనుకోలేని తత్వం ఆ పార్టీ నేతల్లో పెరగడంతో.. ఏ ఎన్నికలోనూ విజయం దగ్గరకు వెళ్లలేకపోయారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో పరువు పోయింది. డిపాజిట్లు కూడా రాలేదు. నాగార్జున సాగర్‌లో బీజేపీ చేరికలను ప్రోత్సహించలేకపోయిది. అక్కడ కూడా జనారెడ్డి లేదా ఆయన కుమారుడు.. బీజేపీలో చేరి పోటీ చేసి ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌కు గండి కొట్టారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా.. ఆ పార్టీకి ఉన్న మౌలిక సదుపాయాల ముందు సరితూగలేదు. దీంతో మరోసారి సట్టింగ్ స్థానంలో ఘోర పరాజయమే చవి చడాల్సి వచ్చింది.
పూర్తి స్థాయిలో మారితోనే ఫైనల్స్‌లో ఆశలు
ఉపఎన్నికల ఫలితాలకు.. అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోయే పోరాటానికి సంబంధం ఉండదు. ఓ నియోజకవర్గం.. ఓ స్పెషల్ ఎజెండా ప్రకారం జరిగే ఎన్నికలకు.. ప్రభుత్వాన్ని మార్చాలా వద్దా అన్న అజెండాతో జరిగే ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అందుకే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశాభావంతోనే ఉన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో పాటు భవిష్యత్ నేతగా రాహుల్ గాంధీకి అత్యధిక మంది మద్దతు పలుకుతున్నారని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తుందని..ప్రజలంతా కాంగ్రెస్ వెంటనే ఉంటారని నమ్ముతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా.. పూర్తి స్థాయిలో కష్టపడి.. వచ్చే ఎన్నికలకు పని చేయాలని వారనుకుంటున్నారు.