తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరిగా జరిగిన ఎన్నిక కావడంతో మునుగోడు ఉప ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లను పక్కనపెడితే.. వారితో పాటు తాము సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ ప్రభావం చూపలేకపోయారు. పోరాడి మరీ రోడ్డు రోలర్ గుర్తు దక్కించుకున్న శివకుమార్ ఎన్ని ఓట్లు చీల్చుతారు, ఎన్ని ఓట్లు వస్తాయోననే ఆసక్తి నేతల్లో ఉండేది. కానీ నేటి కౌంటింగ్ చూసి ఊపిరి పీల్చుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.
నెక్ట్స్ సీఎం అన్నారు.. విజయోత్సవాలకు పర్మిషన్.. కానీ !
తెలంగాణకు నెక్ట్స్ సీఎం తానేనంటూ కేఏ పాల్ కొన్ని రోజుల కిందట అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తేలిపోయారు. అత్యధిక ఓట్లు తెచ్చుకుంటున్న అభ్యర్థులలో టాప్ 5లో కూడా నిలువలేకపోయారు. తెలంగాణకు కాబోయే సీఎంను రెస్పెక్ట్ ఇవ్వండని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలతో ఓటింగ్ వద్దు అని తాను కోరినా పట్టించుకోలేదన్నారు. ఫలితాలకు ముందే విజయోత్సవ ర్యాలీకి అనుమతి తీసుకున్నామని చెప్పిన పాల్.. ఐదు రౌండ్ల తరువాత టాప్ 5లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. రౌండ్ రౌండ్ కు వంద ఓట్లు కూడా రాలేదు. కావాలనే తనపై కక్షకట్టి తన ఓటర్లను కొనేశారని పాల్ ఆరోపించారు. రీ కౌంటింగ్ కి దరఖాస్తు చేస్తానని తెలిపారు.
ప్రవీణ్ కుమార్ ప్రభావం అంతంతమాత్రమేనా !
బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎదుర్కొన్న తొలి ఎన్నిక మునుగోడు బైపోల్. మునుగోడు ఉప ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసినా ఆ పార్టీ అభ్యర్థి ఆందోజు శంకరా చారి అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నామని.. అణగారిన వారికి అధికారం చేరువ కావడానికి మునుగోడు ఉప ఎన్నిక తొలి అడుగులని ప్రవీణ్ కుమార్ భావించారు. కానీ నేడు జరుగుతున్న కౌంటింగ్ లో ఐదు రౌండ్ లు తరువాత సైతం బీఎస్పీ అభ్యర్థికి వెయ్యి ఓట్లు కూడా రాలేదు. బీఎస్పీకి గెలుపు అనేది చారిత్రక అవసరమని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కానీ తాజా ఎన్నికల్లో ఆయన ప్రభావం కనిపించలేదు. బీఎస్పీ పార్టీ మాత్రమే మునుగోడులో బీసీ నేతకు టికెట్ ఇచ్చిందని, మిగతా పార్టీలు ఈ సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదని ప్రజల కోసం గొంతెత్తినా మార్పు సాధ్యం కాలేదు. ఈవీఎంలో నెంబర్ 1 స్థానంలో బీఎస్పీ గుర్తు ఉంది. పార్టీ గుర్తు ఏనుగు అని బాగా ప్రచారం చేస్తున్నారు. ఈవీఎంలో సీరియల్ నెంబర్ 1లో రావడం బీఎస్పీకి కలిసొచ్చే అంశం అని ఆ పార్టీ నేతలు భావించినా ఆశించిన మేర ఓట్లు రాబట్టలేకపోయింది.
పోరాడి గుర్తు సాధించుకున్నా కనిపించని ప్రయోజనం !
యుగ తులసి పార్టీకి శివకుమార్ తాను పోరాడి మరీ రోడ్డు రోలర్ గుర్తు సాధించుకున్నారు. దానివల్ల టీఆర్ఎస్ ఓట్లు భారీగా చీలుతాయని ప్రధాన పార్టీలు భావించాయి. కానీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కు రోడ్ రోలర్ గుర్తు 60, 70 కు మించి ఓట్లు రాలేదు. మొదట రోడ్డు రోలర్ కేటాయించి, ఆతర్వాత బేబీ వాకర్ గుర్తును కేటాయించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరీ అనుకున్నట్లుగా రోడ్డు రోలర్ గుర్తును సాధించుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు శివ కుమాన్.