BRS Candidates List :  భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో మెరుపులేం లేవు. కానీ మరకలు పడిన నేతలందరికీ జాబితాలో చోటు దొరికింది.  ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీం సర్వేలు చేసినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు.  యాభై మందిని మారుస్తారని లీకులు వచ్చాయి.  చివరికి ఏడుగురి విషయంలోనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడుగురు కూడా తిరగబడేవారు కాదు.. కనీసం బలమైన వాళ్లు కాదు. వారిని మార్చినా మార్చపోయినా పోయేదేం లేదు. మరి కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు కఠిన  నిర్ణయాలు తీసుకోలేకపోయారు 


కేసీఆర్ ను చూసి ఓటేయాలన్న గత వ్యూహమే అలు చేస్తున్నారా?


2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్న కేసీఆర్ రాజ్ భవన్  కు వెళ్లి .. అసంబ్లీ రద్దు లేఖ  అందించి.. నేరుగా తెలంగాణ భవన్‌కు వచ్చారు.  105 మంది అభ్యర్థుల జాబితాను  విడుదల చేశారు. ఇందులో ముగ్గురు సిట్టింగ్‌లకు మాత్రమే టిక్కెట్లు నిరాకరించారు. అప్పుడు కేసీఆర్ అనుకున్న వ్యూహం.. ఎమ్మెల్యేల్ని కాదు.. కేసీఆర్ ను చూసి ఓటేయాలని ప్రజలు అనుకోవడం. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా అదే ప్లాన్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అభ్యర్థులపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.  ఫ్రె్ష్ ఫేసులతో కేసీఆర్ రంగంలోకి  దిగుతారని చాలా మంది అనుకున్నారు. కానీ లిస్ట్ చూస్తే.. మొత్తం వారే. గత పదేళ్లుగా  ఎమ్మెల్యేలుగా ఉన్న వారే ఈ సారీ పోటీ పడుతున్నారు. వారిపై నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకత.. వారి వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని స్పష్టమైన  సూచనలు కనిపిస్తున్నాయి. అయినా కేసీఆర్ వారిని మార్చేందుకు కేసీఆర్ ఆసక్తి చూపలేదు. 


పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా  వారే ప్రజల్లోనే కాదు..క్యాడర్ లోనూ వ్యతిరేకత ! 
  
పదేళ్లుగా ఉన్న ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉంటుంది. అందులో డౌట్ లేదు. 2018లోనే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత ఎదురయింది. తిరుగులేని అధికారంతో ఎమ్మెల్యేలు .. చివరికి దళిత బంధు నిధుల్లోనూ వాటాలా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరు.. ఇద్దరు కాదు..దాదాపుగా ఎమ్మెల్యేలంతా ఇలాంటి దందాలు లెక్కలేనన్ని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.    అందర్నీ  మార్చలేక.. కొందర్ని మార్చితే ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక కేసీఆర్ .. మార్చామని చెప్పుకోవడానికన్నట్లుగా ఏడుగుర్ని మర్చినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వారే అభ్యర్థులు అయితే కేసీఆర్ ను .. అభ్యర్తిగా చూసి ఓట్లేస్తారని బీఆర్ఎస్ వ్యూహం రచించిందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. 


పార్టీ నేతలు జారి పోకుండా చూసుకోగలరా? 
   
 మైనంపల్లికి సీటు ఖరారు చేసినప్పటికీ.. ప్రకటన చేయక ముందే  తిరుమలలో నేరుగా హరీష్ రావుపై విరుచుకపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినప్పటికీ.. జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. ఆయన పేరు హోల్డ్ లో పెట్టలేదు. ఆయన రెండు టిక్కెట్ల కోసం కాంగ్రెస్ తో మాట్లాడుకుని విమర్శలు చేశారని ప్రచారం జోరుగా సాగుతున్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి. అదే సమయంలో.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్న క్యాడర్ .. ఇంకా ఈ నేతల్ని భరిస్తారా మీమాంస కూడా ఉంది .ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేయడం సాధ్యం కాక.. చాలా వరకూ అలా వదిలేశారు. ఇప్పుడా ప్రభావం ఎలా ఉంటుందనేది ముందు ముందు తెలుస్తుంది.  2018లోలా కాదు ఇప్పుడు  కాంగ్రెస్, బీజేపీ రూపంలో నేతలకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. టిక్కెట్లు దక్కని వారు..  ఆ పార్టీల్లోకి వెళ్తారు. తమకు నచ్చని అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చినందున క్యాడర్ కూడా వెళ్లవచ్చు. మైనంపల్లి లాంటి టిక్కెట్లు పొందిన వారూ వెళ్తే.. బీఆర్ఎస్ సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింటుంది.