AP BRS Politics :   భారత రాష్ట్ర సమితి ఆంద్రప్రదేశ్ శాఖలో గందరగోళం ఏర్పడింది. చేరికలే పెద్దగా లేకపోగా.. చేరిన వారు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఏపీ బీఆర్ఎస్‌ తరపున మొదట ముగ్గురు కీలక నేతలు చేరారు. వారిలో తోట చంద్రశేఖర్ ఒకరు కాగా మాజీ మంత్రి రావెల కిషోర్, మరొకరు చింతల పార్థసారధి. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒక్క తోట చంద్రశేఖర్ మాత్రమే అప్పుడప్పుడూ బయట కనిపిస్తున్నారు. మిగతా ఇద్దరూ అసలు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. వారిద్దరూ పార్టీలో లేనట్లేనన్న ప్రచారం జరుగుతోంది. అ అసలు చేరికలే లేకపోగా ఉన్న వారు కూడా ఇలా సైలెంట్ కావడంతో ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ సందేహంగా మారింది. 


పార్టీలో చురుకుదనం  తేలేకపోయిన తోట చంద్రశేఖర్


ఆంధ్రప్రదేశ్  లో బీఆర్ఎస్ విస్తరణను కేసీఆర్ మొదట్లో చాలా సీరియస్ గా తీసుకున్నారు. చాలా మంది నేతల్ని సంప్రదించారు. అయితే ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో చివరికి మూడు ప్రదాన పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయిన తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో ఆయనకే  ఏపీ బీఆర్ఎస్ పగ్గాలిచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ కూడా చేరారు. మరో నేత చింతల పార్థసారధి కూడా చేరారు. ఇందులో రావెల కిషోర్ ను  జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఉపయోగించుకుంటారని చెప్పుకున్నారు. కానీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అదే సమయంలో తోట చంద్రశేఖర్ అందర్నీ కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారు. ఫలితంగా వారిద్దరూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం మానేశారు. 


ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికీ దూరం !


ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ అటు బీఆర్ఎస్ జాతీయ నాయకులు కానీ.. ఇటు రరాష్ట్ర నేతలు కానీ ఎవరూ పట్టించుకోలేదు. జాతీయ నేతలంటే.. తెలంగాణ నేతలు.. ఏపీలో ఎక్కువగా పర్యటించే తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు కూడా రాలేదు. ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదు. అదేదో తోట చంద్రశేఖర్ సొంత భవనంలా ప్రారంభించుకున్నారు. ఇప్పుడు ఆ భవనం బోసిపోతోంది. ఎవరూ ఉండటం లేదు. తోట చంద్రశేఖర్ కూడా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. దీంతో చేరేవారు లేరు.. చేర్పించుకునేవారు లేరన్నట్లుగా పరిస్థితి మారింది. 


ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టని బీఆర్ఎస్ 


ఏపీలో ఓ శాఖను  పేరుకు ఏర్పాటు చేశారు కానీ కేసీఆర్ ఇంత వరకూ పార్టీలో చేరిన నేతలకు ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క ప్రోగ్రామ్ కూడా చేయలేదు. ప్రభుత్వంపై పోరాటం లేదా.. ప్రజా ఉద్యమం లాంటి కార్యక్రమం చేయలేదు. మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో విజయోత్సవ సభ పెడతామని తోట చంద్రశేఖర్ చెప్పారు కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు  పూర్తిగా కేసీఆర్ ఏపీ లో పార్టీ విస్తరణ విషయంలో పెద్దగా ఆసక్తి లేనట్లుగా కనిపిస్తూండటంతో ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు లేనట్లయ్యాయి.