BJP Vs YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ నేతల దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారిపై విరుచుకుపడతారు. ఎవరైనా వచ్చి ప్రతిపక్షాన్ని పొగిడినా ఊరుకోరని ఇటీవల రజనీకాంత్ ఉదంతంతో తేలిపోయింది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు ఇతరులు చేస్తే.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పటికే తమకు మాత్రమే సాధ్యమైన భాషలో హోరెత్తించి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జేపీ నడ్డా విమర్శలకు పెద్దగా కౌంటర్ ఇవ్వడం లేదు.
ఘాటు విమర్శలు చేసిన జేపీ నడ్డా
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా సాదాసీదా విమర్శలు చేయలేదు. చాలా ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండి పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జేపీ నడ్డా ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేశంలోనే మోస్ట్ అవినీతి పార్టి వైసీపి పార్టీ తేల్చిచెప్పారు. ఏపీలో జరగని అవినీతే లేదన్నారు. మైనింగ్ స్కాం, లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, ఎడ్యుకేషన్ స్కాం వైసీపి హయాంలోనే జరుగుతుందోందన్నారు. కేంద్రం ప్రభుత్వం నిజమైన అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఇటువంటి అవినీతి ప్రభుత్వంను ఎక్కడా చూడలేదన్నారు. నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఎక్కడ కనిపించలేదన్నారు. దేశంలో శాంతి భధ్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపి మాత్రమేనని.. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంను ఎక్కడ చూడలేదన్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని కూడా ప్రకటించారు. రాజధాని విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. అమరావతికే తమ పార్టీ కట్టుబడి ఉందని.. జగన్ వల్లే ఏపీకి రాజధాని లేకుండాపోయిందని మండిపడ్డారు.
ఇతర పార్టీల్లా బీజేపీపై దూకుడుగా ఉండలేని స్థితి వైఎస్ఆర్‌సీపీ
బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ నేతలు వచ్చి విమర్శించినా నవ్వుతూ భరించాలి కానీ.. విమర్శలు చేసే పరిస్థితి లేదు. వైసీపీ స్టైల్లో అసలు విమర్శలు చేసే అవకాశం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై నోరు జారితే.. ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అందులో సందేహం లేదు. అందుకే రజనీకాంత్ ను విమర్శించినట్లుగా జేపీ నడ్డాను విమర్శించలేరు. కేంద్రంలో ఉన్న పార్టీ పట్ల కనీస భయభక్తులు పాటించాల్సిన అవసరాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకంటున్నారు. నిజానికి వైసీపీలో విపక్ష నేతలను తిట్టాలన్నా.. పార్టీ ఆఫీసు నుంచి సిగ్నల్స్ రావాల్సిందే. స్వతహాగా ఎవరూ మాట్లాడరు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిపై అంటే అసలు మాట్లాడకపోవచ్చు.
ఆదివారం అమిత్ షా సభ - ఆయనా విమర్శలు చేస్తే వైసీపీ వైఖరి ఎలా ఉంటుంది ?
ఆదివారం విశాఖలో అమిత్ షా బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఆ సభలోనూ.. జగన్ ప్రభుత్వ పనితీరుపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేస్తే.. బీజేపీ ఇంత కాలం.. వైఎస్ఆర్‌సీపీపై పెట్టుకున్న సానుకూల ధరోణిని మార్చుకుందన్న అభిప్రాయం బలపడుతుంది. వైసీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరుగుతోందని బీజేపీ నమ్ముతుందని అనుకుంటారు. అదే జరిగితే పొత్తుల రాజకీయాల్లో కీలకమైన మార్పులు వస్తాయి. అప్పుడైనా వైఎస్ఆర్‌సీపీ స్టాండ్ మారుతుందేమో చూడాల్సి ఉంది.