India Vs Bharat Controversy: ఇండియా పేరు భారత్‌గా మారుస్తున్నారంటూ ఇప్పుడు దేశం పేరుపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇండియా పేరును ఇంగ్లీష్‌ లో కూడా భారత్‌గా మార్చాలని కేంద్రం భావిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. జీ 20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి ఇచ్చే విందుకు పంపిన ఆహ్వానపత్రికల్లో ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులుగా ప్రెసిండెంట్‌ ఆఫ్‌ భారత్‌గా ఉండడంతో ఈ చర్చకు దారితీసింది. దీనిపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేరు మార్పుపై ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా స్పందించారు.  తమ కూటమికి భయపడి ఇలా చేస్తున్నారని అన్నారు.


దిల్లీలో మంగళవారం జరిగిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో భారత్‌ పేరు మార్పు అంశంపై జరుగుతున్న చర్చ గురించి విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిది జరుగుతున్నట్లు తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు. అయితే విపక్ష పార్టీలు కలిసి I.N.D.I.A గా పేరు పెట్టుకున్నందుకే ప్రభుత్వం దేశం పేరునే మారుస్తుందా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దేశం 140 కోట్ల మంది ప్రజలది, కేవలం ఒక పార్టీది కాదు అంటూ మండిపడ్డారు. అలాగే ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక వేళ విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్‌ అని మార్చితే అప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. తాము కూటమి పేరును భారత్‌గా మారిస్తే మీరు దేశం పేరును బీజేపీగా మారుస్తారా అంటూ అడిగారు.


ఇటీవల విపక్ష పార్టీలు కలిసి  తమ కూటమికి I.N.D.I.A గా పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే విపక్ష కూటమికి I.N.D.I.A పేరు పెట్టుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారని ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా కాకుండా భారత్‌ అని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. దేశం పేరు మార్చే అంశాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా కూడా స్పందించారు. ఇండియా పేరును బీజేపీ ఎలా తొలగించగలదని ప్రశ్నించారు. ది జాతీయ గుర్తింపుకు సంబంధించిన అంశమని ఒక పార్టీ వ్యక్తిగత ఆస్తి కాదంటూ మండిపడ్డారు. 


కాగా దేశ గౌరవం, దేశం గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై ఎందుకు కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయంటూ బీజేపీ నేతలు అంటున్నారు.ఇండియా అనే పదానికి బదులుగా భారత్‌ అనే పదాన్ని ఉపయోగించాలని దేశం మొత్తం డిమాండ్‌ చేస్తోందని బీజేపీ ఎంపీ హర్నామ్‌ సింగ్‌ తెలిపారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్‌ వారు ఇచ్చారని, భారత్‌ అనే పదం మన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. భారత్‌ అని పేరు మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో దేశం పేరును ప్రస్తావించారు. ఇండియా, అంటే భారత్‌ అని, రాష్ట్రాల యూనియన్‌ అని పేర్కొన్నారు. దేశాన్ని అధికారికంగా ఏమని పిలుస్తారో తెలిపే రాజ్యాంగంలోని నిబంధన ఇదొక్కటే. దీని ఆధారంగానే హిందీలో భారత్‌ రిపబ్లిక్‌ అని, ఇంగ్లీష్‌లో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అని రాశారు.