Bengal Assembly Elections huge turnout: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఏకంగా  92 శాతం ఓటింగ్ నమోదు కావడం భారత ఎన్నికల చరిత్రలోనే ఒక అసాధారణ పరిణామం. ముఖ్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రిజివ్ ప్రక్రియ తర్వాత జరిగిన ఈ పోలింగ్ సరళిపై  అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి.  ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల పేర్లను  తొలగించారు. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 12 శాతం మందిని తొలగించడం వల్ల ఓటర్ల సంఖ్య  తగ్గింది. ఫలితంగా, పోలైన ఓట్ల శాతం గణితపరంగా భారీగా పెరిగింది. చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు , నకిలీ ఓటర్ల తొలగింపు వల్ల  క్లీన్ ఓటర్ లిస్ట్ ఏర్పడిందని, దీనివల్ల ఓటింగ్ శాతం వాస్తవికతకు దగ్గరగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

 అస్తిత్వ పోరాటం -  రైట్ టు ఓట్  సెంటిమెంట్ 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ప్రక్రియను  మినీ ఎన్‌ఆర్‌సీ గా అభివర్ణిస్తూ ప్రచారం చేశారు. తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రచారం గ్రామీణ,  మైనారిటీ ప్రాంతాల్లో బలంగా పనిచేసింది. తమ పౌరసత్వానికి , ఓటు హక్కుకు ముప్పు వస్తుందనే భయంతో ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్  , కోచ్ బెహర్  జిల్లాల్లో 95 శాతానికిపైగా రికార్డు స్థాయి ఓటింగ్ దీనికి నిదర్శనం.

Continues below advertisement

 కేంద్ర బలగాల పహారా - భయం వీడిన ఓటర్లు 

ఈసారి ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం అపూర్వమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుమారు  2,400 కంపెనీల కేంద్ర బలగాలను  కేవలం తొలి దశలోనే రంగంలోకి దించడం వల్ల క్షేత్రస్థాయిలో ఓటర్లకు భరోసా లభించింది. గతంలో అధికార పార్టీ బెదిరింపుల వల్ల ఓటు వేయలేకపోయిన వారు కూడా ఈసారి స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు వేశారని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హింసాత్మక ఘటనలు అక్కడక్కడా జరిగినా, పోలింగ్ ప్రక్రియకు పెద్దగా ఆటంకం కలగకపోవడం ఓటర్ల ఉత్సాహాన్ని పెంచింది.

 నిశ్శబ్ద విప్లవమా?   ఇంత భారీ ఓటింగ్ ఎప్పుడూ ఒకే వైపు మొగ్గును చూపదు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక కుట్రగా భావించిన వారు టీఎంసీ వైపు, అవినీతి,  అక్రమ వలసలకు వ్యతిరేకంగా మార్పు కోరుకునే వారు బీజేపీ వైపు పోలరైజ్ అయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ వేడిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు క్యూలైన్లలో నిలబడటం చూస్తుంటే, ప్రజల్లో ఏదో ఒక అంశంపై బలమైన  నిశ్శబ్ద విప్లవం  నడుస్తోందని అర్థమవుతోంది. సాధారణంగా అధిక ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుందని ఒక వాదన ఉంది. కానీ బెంగాల్ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పుడు 84 శాతం ఓటింగ్ నమోదైతే, 2021లో ఆమె తిరిగి గెలిచినప్పుడు 81 శాతం  పైగా నమోదైంది. ఇప్పుడు 92 శాతం దాటడం అనేది కేవలం ఓటర్ల ప్రక్షాళన వల్ల జరిగిన సాంకేతిక మార్పా లేక ప్రజల్లో వచ్చిన చైతన్యమా అనేది మే 4న వెలువడే ఫలితాల ద్వారానే స్పష్టమవుతుంది.