YSRCP MLCs resignations not accepted:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పార్టీ ఫిరాయించినా ,  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సదరు ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని ఆయా పార్టీలు కోరుకుంటాయి. కానీ, ఏపీ శాసనమండలిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు  తమ పదవులకు రాజీనామా చేసి, ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు. తాము స్వచ్ఛందంగానే పదవులను వదులుకుంటున్నామని ప్రకటించినప్పటికీ, మండలి చైర్మన్ వాటిని ఆమోదించడం లేదు. కోర్టుకు వెళ్లిన జయమంగళ వెంకటరమణ రాజీనామాను సంతృప్తికరంగా లేదని తిరస్కరించడం ఆశ్చర్యకరంగా మారింది.

ఇదతర పార్టీల్లో చేరిపోయిన ఎమ్మెల్సీలు 

 మర్రి రాజశేఖర్  చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీలో చేరారు.  పొతుల సునీత  బీజేపీలో చేరారు.  బల్లి కల్యాణ్ చక్రవర్తి కూడా టీడీపీలోచేరారు.  కర్రి పద్మశ్రీ కూడా టీడీపీలో చేరారు.  జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు.   వీరంతా తమ రాజీనామాలను ఆమోదించడంలో శాసనమండలి చైర్మన్ కాలయాపన చేస్తున్నారని, వీటిని వెంటనే ఆమోదించేలా ఆదేశించాలని జయమంగళ వెంకటరమణ  హైకోర్టును  కూడా ఆశ్రయించారు.   

మండలిలో సంఖ్యాబలం - వ్యూహాత్మక అడుగులు

మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీ నేత.  వైసీపీ ఈ రాజీనామాల విషయంలో ఆచితూచి వ్యవహరించడానికి ప్రధాన కారణం శాసనమండలిలో తమకున్న మెజారిటీ. ప్రస్తుతం మండలిలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఒకవేళ ఈ ఐదుగురి రాజీనామాలను ఆమోదిస్తే, సాంకేతికంగా సభలో ఆ పార్టీ బలం తగ్గుతుంది. అదే సమయంలో ఉపఎన్నికలు వస్తే వైసీపీ గెలిచే అవకాశం లేదు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే, ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం అవి కూటమి పరం అయ్యే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని నివారించేందుకే రాజీనామాల ప్రక్రియను జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.    రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక సభ్యుడు రాజీనామా చేసినప్పుడు అది స్వచ్ఛందంగా జరిగిందా లేదా ఎవరిదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో పరిశీలించే అధికారం సభాపతికి ఉంటుంది. సంతృప్తికరమైన కారణాలు లేవు  అనే సాంకేతిక కారణంతో రాజీనామాలను పెండింగ్‌లో పెట్టడం ద్వారా కాలయాపన చేసే అవకాశం ఉంటుంది. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత చర్చకు దారితీస్తోంది. జయమంగళ రాజీనామాను తిరస్కరించినట్లే ఇతర ఎమ్మెల్సీల రాజీనామాలను కూడా తిరస్కరించే అవకాశం ఉంది. 

 పార్టీ పరువు కంటే పదవే ముఖ్యమా? 

తమ నాయకత్వాన్ని విమర్శిస్తూ ఇతర పార్టీల్లో చేరిన వారిని కూడా తమ వారే  అని చెప్పుకోవాల్సి రావడం వైసీపీ శ్రేణుల్లో కొంత ఇబ్బందికరంగా మారింది. వారు రాజీనామాలు చేసినా ఆమోదించకపోవడం అంటే.. పార్టీ ఆత్మగౌరవం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించడం వల్ల క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేలే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసి..తాము ఇతర పార్టీల్లో కూడా చేరిపోయామని చెప్పినా ఆమోదించకపోవడం.. ఓ రకమైన వింత పరిస్థితే అనుకోవచ్చు.