AP BJP Prajaporu : ప్రభుత్వంపై పోరాటంతో ప్రజల్లోకి ఏపీ బీజేపీ - పొరుగు రాష్ట్రాల తరహాలో బలపడాలంటే ఎన్నో సవాళ్లు !

ఏపీలో బీజేపీ ఎదిగేందుకు ఉన్న అడ్డంకులేంటి ? ఆ పార్టీ నేతల ముందు ఉన్న సవాళ్లేంటి ?

Continues below advertisement

AP BJP Prajaporu : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జవసత్వాలను కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఒకప్పుడు పది వరకూ ఉన్న ఓటు బ్యాంక్ ఇప్పుడు ఒక్క శాతానికి పడిపోయింది. రెండు ప్రధాన పార్టీలు బలంగా ఉండటంతో మరో జాతీయ పార్టీకి అవకాశం లభించడం లేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీ పుంజుకుంటోంది. పొరుగున ఉన్న తమిళనాడు.. తెలంగాణల్లో బీజేపీ పురోగమిస్తోంది.  ఏపీ బీజేపీ నేతలూ ఆ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ప్రజాపోరు సభలను ప్రారంభిస్తున్నారు. 

Continues below advertisement

అధికారపక్షం పై పోరాటానికి వరుస కార్యక్రమాలు !
  
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య  వైఖరిని ప్రశ్నిస్తూ ఈ యాత్రలు చేశారు. తాజాగా ప్రజాపోరు పేరుతో ఐదు వేల సభలు ఏర్పాటు చేయాలని.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  గత 8 సం.ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను గురించి, మంజూరు చేసిన అనేక విద్యాసంస్థలను గురించి ఆ సభల్లో చెప్పనున్నారు.  డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం వల్ల,ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ సభల్లో తెలియచేసి.. ఏపీలోనూా బీజేపీ ప్రభుత్వం వచ్చేలా చేయాలని ఏపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బహిరంగ సభలలో  కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు. 

పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం ఇంత కాలం త్యాగం చేసిన ఏపీ బీజేపీ నేతలు !

ఏపీలో బీజేపీ నేతలు ఓ రకంగా క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వారు ప్రభుత్వాలపై పోరాడటం లేదని.. అధికార పక్షంతో కుమ్మక్కవుతారని.. ఆ పార్టీలో వర్గాలుంటాయని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా అయితే ఏపీ బీజేపీ నేతలు ఎక్కువగా జాతీయ పార్టీ ప్రయోజనాల కోసం రాజీ పడాల్సి వస్తోంది. సొంతంగా పోరాడి బలపడదామనుకున్న ప్రతీ సారి ఢిల్లీ రాజకీయాల కోసం పొత్తుల్లోకి వెళ్లక తప్పడం లేదు. ఈ పొత్తులు ఒక్కోసారి ప్రత్యక్షంగా.. మరోసారి పరోక్షంగా ఉంటున్నాయి. దీంతో హైకమాండ్ ఆలోచనల మేరకు నడుచుకోవాల్సి వస్తోంది. దీంతో వారి పోరాటంలో సీరియస్ నెస్ లేదని వారూ.. అధికారపక్షంలో భాగమేనని ఇతర  పార్టీలు ప్రచారం చేసి..బీజేపీని కోలుకోనీయకుండా దెబ్బతీస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఏపీ బీజేపీ నేతలకు పార్టీని పోటీ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. 

ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్న   బీజేపీ హైకమాండ్ !

ఏపీ బీజేపీ నేతలకు ఇప్పుడు సొంతంగా ఎదగడానికి బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వ్యతరికే పోరాటంలో ముందుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ నుంచి కూడా మద్దతు వస్తోంది. కేంద్ర మంత్రులు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

యువనాయకత్వానికి ప్రోత్సాహం !

బీజేపీ హైకమాండ్ యువ నాయకత్వానికి ప్రోత్సాహం ఇస్తోంది. ఇటీవలి కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్‌లతో పాటు వివిధ స్థాయిల్లోని యువతను ప్రోత్సహిస్తోంది. దీంతో వారు బీజేపీ సిద్ధాంతాలతో జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు ఉన్నా లేకపోయినా ముందు ముందు తమదైన ముద్రవేస్తామని ఏపీ బీజేపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola