TDP Mahanadu 2025: ఒకపక్క రానా వద్దా అంటూ భయపెట్టిన వర్షం.. తొలిసారి కడపలో జరుగుతున్న మహానాడుకు హాజరు అవ్వాలని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పసుపు తమ్ముళ్లు. ఉదయం నుంచే మహానాడు వేదిక వైపు వెళ్లే రోడ్లలో నెలకొన్న భారీ ట్రాఫిక్ జామ్.. నగరం మొత్తం పసుపుమయం కావడంతో ఆసక్తిగా చూస్తున్న కడప పట్టణ ప్రజలు. ఉత్సాహంగా సాగిన నేతల ప్రసంగాలు వీటన్నిటి మధ్య టిడిపి మహానాడు తొలిరోజు ఆసక్తికరంగా సాగింది.
భయపెట్టిన వర్షం
పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి కడపలో జరుగుతున్న మహానాడు కావడంతో ఎలాగైనా దీన్ని భారీ సక్సెస్ చేయాలని కనివిని ఎరుగని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. గత నెల రోజులుగా దీనికి సంబంధించిన ప్రణాళికలు రెడీ చేసింది అధిష్టానం. అయితే అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం గత రెండు రోజులుగా పసుపు తమ్ముళ్ళను భయపెట్టింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి బురదతో నిండిన మట్టిలోనే మహానాడు కమిటీ సభ్యులు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యమంత్రి సహా ఇతర కీలక మంత్రులు అందరూ హాజరయ్యే కార్యక్రమం కాబట్టి పోలీసులు అధికారులు కూడా తమ తమ బాధ్యతలను వానలోనే నిర్వహించారు. బలంగా వేచిన గాలులకు చాలా చోట్ల నాయకుల ఫ్లెక్సీలు నేలకూలాయి.
మంగళవారం ఉదయం నుంచి పరిస్థితి చక్కబడింది. దానితో పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఫ్లెక్సీలు మళ్ళీ కట్టడం, తడిచిన మట్టిపై గట్టి ఇసుకతో నింపారు. వచ్చిన వారంతా ఇబ్బంది పడకుండా నడిచేలా ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆటంకం కలగకుండా అంతా సవ్యంగా జరిగేలా చూశారు. ఇక వాతావరణం కూడా రోజంతా చల్లటి గాలులు వీస్తూ ఆహ్లాదంగా మారడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఎక్కడా ఇబ్బంది పడలేదు. జరిగిన రాజమండ్రి, విజయవాడల్లో మహానాడులో విపరీతమైన ఎండ దాటికి అందరూ తీవ్ర ఇబ్బందులు పాలైన మాట వాస్తవం. కానీ ఈసారి మాత్రం వాతావరణం పూర్తిగా తెలుగుదేశం వైపే ఉన్నట్టు కనబడింది. అందుకే రోజంతా ప్రసంగాలు నడిచినా ఎవరూ సభా ప్రాంగణం వదిలి వెళ్ళలేదు. మిగిలిన రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉండాలని వారు కోరుకుంటున్నారు.
ఆకట్టుకున్న ఫోటో ఎగ్జిబిషన్ లు బ్లడ్ డొనేషన్ క్యాంపు లు
ప్రతి మహానాడులో మస్ట్ గా కనిపించే నాలుగు దశాబ్దాల తెలుగుదేశం ప్రస్థానానికి సంబంధించి ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ఈసారి కూడా ఏర్పాటు చేశారు దివంగత శ్రీపతి రాజేశ్వర్ కుటుంబం. 1983లో ఎన్టీఆర్ తొలిసారి జరిపిన మహానాడు నుంచి ఇలా ఆయన జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోలను ప్రదర్శనకు పెట్టడం ఆయన అభిమాని శ్రీపతి రాజేశ్వర్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. తర్వాత కాలంలో ఆయన మంత్రి అయినప్పటికీ ఈ ఆనవాయితీ వదల్లేదు. ఆయన మృతి చెందిన తర్వాత కుమారుడు శ్రీపతి సతీష్ అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అయితే తొలిసారి ఈ మహానాడులో ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ కు సంబంధించిన అరుదైన ఫోటోలను డిజిటల్ రూపంలో ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూడడానికి మహానాడుకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు క్యూ కట్టారు. ప్రతియేడు లాగే ఈసారి కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహానాడుకు హాజరైన చాలామంది రక్తదానంలో పాల్గొని మంచి మనసు చాటుకున్నారు.
వంటల దగ్గర చింతమనేని ప్రభాకర్ హడావుడిమహానాడు అంటే చెప్పుకునే మరొక ముఖ్యమైన అంశం భోజనాలు. తెలుగువారి సంస్కృతి ఉట్టిపడేలా మహానాడులో లక్షల మందికి భోజనాలు రెడీ చేస్తారు. ఈసారి కూడా అదేవిధంగా రుచికరమైన వంటలు రెడీ అయ్యాయి. కార్యకర్తలకు వాటిని వడ్డించే సమయంలో పలువురు తెలుగుదేశం నాయకులు స్వయంగా వాటిని వడ్డించే ప్రయత్నం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహానాడుకి పచ్చళ్ళు సప్లై చేయడంతోపాటు కార్యకర్తలకు స్వయంగా ప్లేట్లు పంచిపెట్టారు. అలాగే వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, పూతల పట్టు ఎమ్మెల్యే మురళి భోజనాల దగ్గర అందరిని పలకరిస్తూ హడావుడి చేసారు. హోం మంత్రి వంగలపూడి అనిత అయితే భోజనాలు చేస్తున్న మహిళా కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు.
ఎమోషనల్ గా సాగిన ప్రసంగాలుఐదేళ్ల విరామం తర్వాత ఎన్నికల్లో గెలిచిన టిడిపి అధికారంలో జరుపుకుంటున్న తొలి మహానాడు కావడంతో నేతల ప్రసంగాలు చాలా ఎమోషనల్ గా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తల అంకిత భావం గురించి మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ వారు అండగా ఉన్నారంటూ ప్రశంసించారు. ఇక చిన్న బాస్ నారా లోకేష్ అయితే గతంలో సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీల చేతుల్లో దాడులకు గురైన ఉత్తరాంధ్ర కార్యకర్తలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ మహానాడు స్పెషల్ గా చెప్పుకునే ఆరు ముఖ్యమైన ప్రతిపాదనలను కార్యకర్తల ముందు ఉంచారు. ఆ తర్వాత ఆరు అంశాలపై ఒక్కో కీలక నేత, ఇద్దరు కార్యకర్తల చొప్పున ప్రసంగించారు. ఉదయం 8:30 కు ప్రారంభమైన మహానాడు తొలిరోజు కార్యక్రమాలు సాయంత్రం 6 గంటలకు ముగిశాయి. రెండో రోజు అయిన మే 28న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళి కార్యక్రమం ఉంటుంది.