Telangana cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నరగా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐదు స్థానాలను భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సామాజికవర్గాల వారీగా అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా గ్రూపు భేటీలు నిర్వహిస్తున్నారు. రహస్య సమావేశాలు నిర్వహించి ఆ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు.
అసలైన మాదిగ వర్గానికి చాన్స్ ఇవ్వాలంటున్న నేతలు
తాజాగా మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కొంత మంది నేతలు సమావేశమయ్యారు. వారిలో కొంత మంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికే మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన దామోదర్ రాజనర్సింహకు చోటు ఉంది. అయితే ఆయన ఉపకులానికి చెందిన వారని ఈ ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకే అసలైన మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. మరో వైపు మాల వర్గానికి చెందిన వివేక్ పేరు ప్రధానంగా మంత్రి పదవి రేసులో ఉంది.
తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్న సీనియర్ నేతలు
ఇతర వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. హైకమాండ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదవుల భర్తీ విషయంలో హైకమాండ్ తో చర్చించి వచ్చారు. చాలా కాలంగా పలువురు నేతలు తమకు మంత్రి పదవులు ఇవ్వాల్సిదేనని పట్టుబడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి బెదిరింపు తరహా వ్యాఖ్యలు కూడాచేశారు. నల్లగొండ జిల్లా ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిద్దరూ రెడ్డి వర్గానికి చెందిన వారే. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి అడుగుతున్నారు. ఆయన సోదరుడు కూడా మంత్రిగా ఉన్నారు. ఇక పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు వంటి వారు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.
న్యాయం చేస్తామని చెబుతున్న మీనాక్షి నటరాజన్
ఈ సామాజికవర్గాల పరిస్థితులే కాదు.. చాలా వరకూ ప్రాంతాల సమీకరణాలు చూసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు కలిపి ఒక్కరికైనా అవకాశం కల్పించాల్సి ఉంది. నిజామాబాద్ నుంచి.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇప్పటికీ మంత్రి పదవులు లేవు. అలాగే కొన్ని సామాజికవర్గాలకూ ఇంకా అవకాశం లభించలేదు. వీరంతా వివిధ పద్దతుల్లో తమ తమ అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆశావహులు పెరిగిపోవడంతో.. రేపు పదవుల ప్రకటన తర్వాత అసంతృప్తి పెరుగుతుంది. దీంతో పార్టీకి సమస్యలు వస్తాయి. అందుకే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్.. మీనాక్షఇ నటరాజన్.. పదువులు ఆశిస్తూ సమావేశాలు అవుతున్న వారితో మాట్లాడుతున్నారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని హామీలు ఇస్తున్నారు.