AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా హత్యలు, హత్యాయత్నాల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ప్రాజెక్టుల యాత్రలో భాగంగా చిత్తూరుజిల్లాలో పర్యటించిప్పుడు పుంగనూరుకు వెళ్తున్న సమయంలో తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంగళ్లు అనే గ్రామంలో దాడులు జరిగాయి. పుంగనూరు శివార్లలో జరిగింది వేరు. దానిపై ఆ ఘటనలపై ఆరు కేసుల వరకూ పెట్టారు. అన్నింటిలోనూ పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ పేరును ఏ - వన్‌గా పెట్టారు. అంగళ్లు గ్రామంలో జరిగిన దాడుల విషయంలో మాత్రం చంద్రబాబు పేరును ఏ వన్‌గా చేర్చారు. ఇంకా పలువురు టీడీపీ నేతలను కూడా ఈ కేసులో చేర్చారు. చంద్రబాబుపై ఏకంగా అక్కడ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.
చంద్రబాబు ఎవరిపై హత్యాయత్నం చేశారు ?
హత్యాయత్నం, కుట్రల కింద కేసులు నమోదు చేయాలంటే కొన్ని ప్రాధమిక సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. హత్యాయత్నం చేసిన వారు మారణాయుధాలతో దాడి చేసి ఉండాలి. కుట్ర చేసినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అయితే అంగళ్లులో జరిగిన దాడుల ఘటనల విషయంలో చంద్రబాబు కనీసం తన వాహనం కూడా దిగినట్లుగా లేదు. అయితే.. తనపై రాళ్లు విసురుతున్న వారిపై మండిపడిన చంద్రబాబు.. వారిని పోలీసులు ఆపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి.. రాళ్లు విసురుతున్న వారిని తరమాలని సూచించారు. దాంతో టీడీపీ కార్యకర్తలు వారి వెంట పడితే పారిపోయారు. ఈ క్రమంలో చంద్రబాబుపైనే రాళ్ల దాడి జరిగింది. ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్‌జీ కమెండోలో రక్షణ పరికరాలను అడ్డం పెట్టారు. అప్పటికీ వాహనంపై ఉన్న ఓ టీడీపీ నేత తల కూడా పగిలిదింది.
అంగళ్లులో తనపై హత్యాయత్నం జరిగిందని వీడియోలు ప్రదర్శించిన చంద్రబాబు
అంగళ్లలో అసలేం జరిగిందో కొన్ని వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. తనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా తెలియడంతో ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడేం జరిగిందో వీడియో ప్రదర్శించారు. చంద్రబాబు అంగళ్లకు రావడానికి ముందే తెలుగుదేశం పార్టీ జెండా తో వాహనంపై వెళ్తున్న వారిని దాడి చేసి కొట్టడం, చంద్రబాబు పుంగనూరు వస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతల వీడియోలను, చంద్రబాబుపై రాళ్లు విసురుతున్న వైసీపీ కార్యకర్తలను నిలువరించకుండా చూస్తున్న పోలీసుల తీరు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు, పోలీసుల లాఠీచార్జ్ వంటి దృశ్యాలను ప్రదర్శించారు. చాలా స్పష్టంగా తనపై హత్యాయత్నం చేసి..తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని.. ఈ విషయాన్ని సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అంగళ్లులో గతంలోనూ టీడీపీ నేతలపై దాడులు
తంబళ్ల పల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణలు జరగడం ఇదే మొదటి కాదు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ నేతలపై పెద్ద స్థాయిలోనే దాడులు జరిగాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సహా పలువురు గాయపడ్డారు. అయితే ఈ సారి నేరుగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబునాయుడుపైనే రాళ్ల దాడి జరగడం సంచలనం అయింది. ఈ అంశంపై అసలేం జరిగిందో చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ టీమ్ .. తమ శాఖకు రిపోర్ట్ చేస్తుందని అంటున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మార్కాపురంలోనూ ఇలాగే రాళ్ల దాడి జరిగింది. అప్పుడు ఓ వృద్ధుడు రాళ్ల దాడిలో గాయపడి పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయారు. తర్వాత కృష్ణా జిల్లా నందిగామలోనూ రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలో కరెంట్ కూడా పోయింది. ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ అధికారికి తల పగిలింది. చంద్రబాబుపై రాళ్ల దాడులు కావాలనే చేస్తున్నారని.. చంద్రబాబు వయసు దృష్ట్యా రాళ్లు తగిలితే ప్రాణాపాయం ఉంటుందని తెలిసే ఈ పని చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.