అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కల్లాకపటం తెలియని వారు గిరిజనులు వారికి ఎల్లప్పుడూ కూడా విద్య , వైద్యం అందుబాటులో ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 


బుధవారం జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అడవుల్లో, కొండల్లో ఉంటూ అడవి సంప్రదాయాలను బతికించుకుంటున్నారని వారిని ఆయన అభినందించారు. అడవిలో ఉండే చెట్లనే వారు దైవంగా భావిస్తారు. అడవిలో ఉండే సకల జీవాలను కూడా వారు దైవ సమానంగా చూస్తారు. వారి జీవన విధానం నిత్యం ఎన్నో సవాళ్లతో కూడి ఉంటుంది. అలాంటి వారికి ఇప్పటికీ వైద్యం అనేది అందని ద్రాక్షలాగా మిగిలింది.


వైద్యంతో పాటు విద్య, శుభ్రమైన తాగునీరు వారి చెంతకు చేరకుండా ఉన్న కుసుమాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొండ దాటి బయట ప్రపంచానికి రాని ఆ బిడ్డలకు ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం ఆసుపత్రులకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని..అలాంటి కొన్ని సమయాల్లో వారి ప్రాణాలు కూడా పోతున్నాయని ఆయన బాధపడ్డారు.


ఆ కొండ ప్రాంతాల్లో నిండు గర్భిణుల ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఎన్నో సార్లు మనం టీవీల్లో చూస్తూనే ఉన్నాం. రానున్న రోజుల్లో అయిన ఆ పరిస్థితి మారాలని, ఆ కొండ తల్లి బిడ్డలను ఎలాగైనా బయటపడేయాలని ఆయన అన్నారు.


గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ సంబంధిత విభాగాల్లో సేవా భావం కలిగిన వారిని నియమించి ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. అత్యవసర ఆరోగ్య సమయాల్లో అడవి బిడ్డల కోసం ఎయిర్ అంబులెన్సులను సిద్ధం చేయాలని కోరారు.


మంచానికి కర్రలుకట్టి వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాసతో వారు ఆస్పత్రులకు వెళ్ళడం మనం మీడియాల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ చూస్తూనే ఉన్నామన్నారు. ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుందని.. ఈ పరిస్థితి మారాలని కోరారు. ఎంత వ్యయమైనా వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలని చెప్పారు పవన్. 


ఆరు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు.. ఒక ప్రాణాన్ని కాపాడడానికి హెలికాప్టర్‌ ను ఉపయోగించడం భారమైన పని కాదని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్‌ పై పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు.అదే విధంగా గిరిజన బాలబాలికలకు విద్య అందుబాటులో ఉంచాలన్నారు. 


గిరిపుత్రులు వారు కోరుకున్న జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కనీస అవసరాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సూచించారు. గిరిజన లోకంలో చైతన్యం వెల్లివిరియాలని, వారు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్.