Vijayasai Reddy will join the Congress party: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి .. వైసీపీకి కూడా గుడ్ బై చెప్పినట్లుగా శుక్రవారం ట్వీట్ చేశారు. అయితే ఆయన అంతకు ముందు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను కలిశారు. లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో షర్మిలతో చర్చలు జరిపారు. దాదాపుగా మూడు గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో రాజకీయ అంశాలపైనా మాట్లాడుకున్నారని చెబుతున్నారు.
ఆస్తుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీలో కేసు వేసినప్పుడు జరిగిన వివాదంలో విజయసాయిరెడ్డి పెట్టిన అ ప్రెస్ మీట్‌లో షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారని మండిపడ్డారు. ఈ అంశంపై షర్మిల కూడా మనస్థాపానికి గురయ్యారు. విజయసాయిరెడ్డి చాలా కాలంగా వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా ఉన్నారు. విజయసాయిరెడ్డి సమక్షంలోనే ఆస్తుల గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఆమె అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం అలాంటిదేమీ లేదని షర్మిలపైనే విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు రాజకీయంగా సన్యాసం తీసుకున్న తర్వాత షర్మిలతో భేటీ అవడానికి కారణాలేమిటన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్తుల వివాదంలో తాను జగన్ తరపున ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో షర్మిలకు వివరణ ఇచ్చారని అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వాటి ప్రభావంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉందన్న అంశంపైనా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. తాను ఎందుకు రాజ్యసభకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పినట్లుగా తెలుస్తోంది. కూటమికి తాను రాజీనామా చేసిన సీటు వెళ్తుందని తెలిసినా రాజీనామా చేశానని .. తప్పని పరిస్థితులు ఏర్పడినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి చేరికపై ఈ భేటీతో ఊహాగానాలు పెరిగే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఆయన షర్మిలతో భేటీ అయినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వైఎస్ కుటుంబం ఎదిగిందని .. ఆ పార్టీతో తమకు దూరం ఏమీ లేదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొంత కాలం విరామం తీసుకుని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిలకు చేదోడువాదోడుగా ఉండాలని విజయసాయిరెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్రమాస్తుల కేసుల్లో వేగం పుంజుకునే అవకాశం ఉందన్న కారణంగా కొంతకాలం వేచి చూడాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
రాజకీయాల్లో పదవుల్ని వదులుకుని మరీ రిటైర్మెంట్ తీసుకున్న నేతలు ఎవరూ ఎక్కువ కాలం బయట ఉండలేదు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. అలా.. విజయసాయిరెడ్డి కూడా కొంత విరామం తర్వాత తాను రాజకీయాల్ని వదిలేసినా.. తనను రాజకీయాలు వదల్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.