VijayasaiReddy : వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి , చంద్రబాబు బంధువులు. ఈ విషయం ఎవరికైనా తెలుసా ?. ఎవరికీ తెలియదు అసలు అలాంటి ఊహ కూడా ఎవరికీ వచ్చి ఉండదు. ఎందుకంటే రాజకీయంగా తీవ్రంగా విభేదించుకునే పార్టీలోనే కాదు విజయసాయిరెడ్డి చంద్రబాబును దారుణంగా తిడుతూ ఉంటారు. ట్విట్టర్‌లో ఆయన చేసే ట్వీట్లను చూస్తే చంద్రబాబు అంటే ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబును తన అన్న అని అంటున్నారు. దానికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు.
తన సోదరి కుమార్తెను తారకరత్న పెళ్లి చేసుకున్నారన్న విజయసాయిరెడ్డి
చంద్రబాబు మేనల్లుడు నందమూరి తారకరత్న. ఆయన పెళ్లి చేసుకుంది విజయసాయిరెడ్డి చెల్లెలి కూతుర్నట. ఆ విషయాన్ని విజయసాయిరెడ్డే చెబుతున్నారు. తారకరత్న భార్య తన చెల్లిలి కుమార్తె కాబట్టి చంద్రబాబు తనకు బంధువు అయ్యాడని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. వరుసకు తనకు చంద్రబాబు అన్న అని అంటున్నారు.
అలా తనకు చంద్రబాబు అన్న అయ్యారంటున్న విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి ఇంత బంధుత్వం ఎందుకు కలుపుకున్నారంటే దానికీ ఓ లాజిక్ ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవలి కాలంలో అదాన్ డిస్టిలరీ అనే కంపెనీ గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ఆ కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిదని ఆరోపిస్తున్నారు. అయితే ఏంటి అనే డౌట్ రావొచ్చు. ఇప్పుడు ఏపీలో మద్యం సరఫరా చేస్తున్న కంపెనీల్లో అదాన్ డిస్టలరీ కీలకం. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ కంపెనీని పెట్టారు. వేల కోట్ల విలువైన మద్యాన్ని ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసింది. అదంతా నకిలీ మద్యమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీ తమది కాదని.. తమ బంధువులు ఉన్నంత మాత్రాన తనది కాదని చెప్పడానికి చంద్రబాబుతో తనకు బంధుత్వ లాజిక్‌ను విజయసాయిరెడ్డి తెచ్చారు.
తన కుటుంబానికి అరబిందో తప్ప ఏ వ్యాపారాలూ లేవంటున్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ
పైన చెప్పిన లెక్కలో చంద్రబాబు తన అన్న కాబట్టి ఆయన ఆస్తులన్నీ తనవి అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబానికి అరబిందోలో తప్ప ఎక్కడా వ్యాపారాలు లేవన్నారు. అదే సమయంలో విశాఖలో క్రూయిజ్ బిజినెస్ కూడా తమ కుమార్తెది కాదన్నారు. చంద్రబాబుకుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరక్టర్లు చాలా మంది ఇతర కంపెనీల్లో డైరక్టర్లుగా ఉన్నారని.. వారు డైరక్టర్లుగా ఉన్న కంపెనీలన్నీ చంద్రబాబువేనా అని ప్రశ్నించారు.
రాజకీయంగా చాలా ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు కానీ.. విజయసాయిరెడ్డి అనూహ్యంగా చంద్రబాబుతో తనకు ఉన్న బంధుత్వాన్ని హైలెట్ చేసుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.