Jagan Vs TDP Janasena : వెతుకు వెతుకు వెతికితేనే కదా దొరికేది అని ఓ సినిమాలో కమెడియన్ సునీల్ చెప్పే డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడలా వెతికిన విపక్షాలకు మళ్లీ రోడ్ల రాజకీయాలు గుర్తొచ్చాయి. నాడు నేడు అంటూ వైసీపీ-టిడిపి ల పార్టీలు రోడ్ల పరిస్థితిని చూపిస్తూ సోషల్ వార్ లో నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. ఇప్పుడు జనసేన కూడా ఆ రూటునే ఎంచుకుంది. ఇంతకు ముందు ఆ పార్టీ నేతలు కూడా ఈ పోరులో దిగారు కానీ ఇప్పుడు మాత్రం తమ స్టైల్లో దూసుకొస్తున్నారు.
సీఎం పెట్టిన డెడ్‌లైన్ మేరకు బాగు పడని రోడ్లు
ఏపీలో కొన్నాళ్లుగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగింది. దీనికి తోడు విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడంతో సిఎం జగన్ స్పందించారు. జూలై 15 కల్లా అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఆదేశించడమే కాదు డెడ్ లైన్ కూడా పెట్టారు. ఆ డెడ్‌లైన్ ముగియడంతో జనసేన రోడ్ల దుస్థితిపై డిజిటిల్ క్యాంపెయిన్ కి సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 17వ తేదీ వరకు జరిగే ఈ క్యాంపెయిన్ ద్వారా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని వీడయోలు, ఫోటోల రూపంలో సిఎం కి తెలిసేలా చేయాలని పార్టీ కేడర్ తో పాటు ప్రజలను కూడా కోరారు. దానికి దగ్గట్లుగానే మంచి స్పందన వచ్చింది. ట్విట్టర్‌లో లక్షల ట్వీట్లు వచ్చాయి.
వర్షాల్లో రోడ్లు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు
ఇంకోవైపు టిడిపి కూడా అటు రోడ్లు ఇటు చెత్త రెండింటిని మిక్స్ చేసి జగన్ పై విరుచుకుపడుతున్నాయి. చెత్త రోడ్లు – చెత్త ముఖ్యమంత్రి అన్న హ్యాష్ ట్యాగ్ తో పచ్చపార్టీ రచ్చరచ్చ చేస్తోంది.ఇంకోవైపు విపక్షాల ఆరోపణలకు అధికారపార్టీ కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఊహించని విధంగా ఈసారి జూలైలోనే అత్యధికంగా వర్షపాతం నమోదు అయిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుంటే ఎలా రోడ్లు వేయగలరో టెక్నాలజీకే గురువు అయిన చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు చెప్పాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. బాబు, పవన్ లకు ఇన్నాళ్లకి ముఖ్యమంత్రి జగన్ అన్న విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ సవాళ్లపై ప్రజల విరక్తి
ఏ ప్రభుత్వాలు వచ్చినా చేసేంది ఏమీ లేదని.. ఎవరి చెత్త రాజకీయాలు వారివేనంటున్నారు సామాన్యులు. ఛాలెంజ్ , దమ్ము, సవాళ్లు వంటి డైలాగులు వినివినీ విసుగు వచ్చిందంటున్నారు. ప్రతీ ఏటా రోడ్ల అభివృద్ధికి కేటాయించే నిధులు లెక్కల్లో తప్ప కళ్ల ముందు కనిపించడం లేదంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఏ దారి చూసినా రహదారి కనిపించదంటున్నారు.