YS Jagan Vs Vijayasai Reddy :వైసీపీని వీడుతున్న నేతలపై ఆ పార్టీ అధినేత చేసిన కామెంట్స్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్యారెక్ట్ ఉన్నావాడిని కాబట్టే తాను పదవులను వదులుకొని బయటకు వచ్చేశానంటూ బదులిచ్చారు. దీనిపై వైసీపీ కేడర్ పైర్ అవుతుంటే ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాలంటూ సాయిరెడ్డికి సూచిస్తున్నారు. 

జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, కక్షసాధింపులు ఉంటాయని వాటికి భయపడిపోకూడదని హితవులు పలికారు. ఇలాంటి బెదిరింపులకో ఏదో ప్రలోభాలకో లొంగి పార్టీ మారిన వారిని ప్రజలు గుర్తించరని అన్నారు. అలాంటి వారిని అక్కున చేర్చుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉండరని కామెంట్స్ చేశారు. 

ఈ మధ్య పార్టీని విడిచిపెట్టి వెళ్లిన సాయిరెడ్డి కావచ్చు, గతంలో పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలకు కావచ్చు... రేపో మాపో వెళ్లబోయే మరికొందరికైన ఇదే వర్తిస్తుందని జగన్ అన్నారు. అన్ని బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేసిన వారినే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. ఇలాంటి వారి వల్ల వైసీపీ నిలదొక్కుకోలేదని కూడా కామెంట్ చేశారు. కేవలం దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతోనే వైసీపీ మనుగడ సాధిస్తోందని అభిప్రాయపడ్డారు. 

Also Read: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హ్యాపీ న్యూస్‌- నాలుగు నెలల్లో మూడు కీలక పథకాల అమలకు కార్యాచరణ సిద్ధం

రాజకీయాల్లో ఉన్న వాళ్లకు విలువలు, విశ్వసనీయ, క్యారెక్టర్ ఉండాలంటూ జగన్ చేసిన కామెంట్స్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనకు వ్యక్తిగతంగా కూడా అలాంటివి ఉన్నాయని అందుకే తన పదవులకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. "వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా." అని విజయసాయిరెడ్డి ఎక్స్‌లో రాసుకొచ్చారు. 

జగన్ అభిమానుల ఆగ్రహం

జగన్‌కు కౌంటర్‌గా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్‌పై జగన్ అభిమానులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకు రాజీనామా చేశారని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లు పదవి ఉండగానే సడెన్‌గా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని వెళ్లిపోయిన వ్యక్తి రాజకీయాలపై స్పందించడం ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

సాయి గారూ జాగ్రత్త అంటున్న జగన్ ప్రత్యర్థులు

జగన్ ప్రత్యర్థులు కూడా సాయిరెడ్డి ట్విట్టర్‌పై స్పందిస్తున్నారు. జగన్ గత చరిత్ర చూస్తే సాయిరెడ్డి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. జగన్ అధికారంలో లేనప్పుడు వెళ్లిపోయిన సాయిరెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి, జగన్ మధ్య జరుగుతున్న వార్ ఏ తీరానికి చేరుతుందో అన్న చర్చ సాగుతోంది. 

Also Read: మర్యాదపూర్వకంగా కూడా జగన్‌ను కలవని విజయసాయిరెడ్డి - ఇద్దరు ఆత్మీయుల మధ్య అంతగా చెడిందా ?