Andhra Pradesh Latest News: ఎన్నికల హామీల్లో అత్యతం కీలకమైన మరో 3 పథకాలను రానున్న 4 నెలల్లో అమలు చేయాలని ఏపీ మంత్రివర్గం( AP Cabinet) నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనంతోపాటు డీఎస్సీ(DSC) నియామకాలు పూర్తి చేయనున్నారు. ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని సీఎం తెలిపారు. ఎమ్మెల్సీ (MLC)ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) పథకాన్ని సైతం అమలు చేయనున్నట్లు వివరించారు. ఖరీప్ సీజన్ పెట్టుబడులకు గానూ....మే నెలలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
సూపర్‌సిక్స్ అమలు
గతేడాది ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ (Super 6)హామీలు అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలావరకు హామీలు అమలు చేయగా... కీలకమైన మరో మూడు హామీలను రానున్న నాలుగు నెలల్లో అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని పాఠశాలలు పున: ప్రారంభించే జులై నాటికి అమలు చేయాలని...అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసంతకం చేసిన డీఎస్సీ నియామక ప్రక్రియ సైతం పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పిల్లలను పెంచలేం, చదివించలేం అన్న కారణంతోనే చాలామంది కనడం లేదని...ప్రభుత్వమే వారి బాధ్యత తీసుకుంటే తల్లిదండ్రులకు ఏ చింత ఉండదని సీఎం అన్నారు. అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలోకి ఇకపై నాణ్యమైన పోషక విలువలు కలిగిన సన్న బియ్యం అందజేయనున్నారు.
Also Read: ఏపీలో మంత్రులకు ర్యాంకులు- చంద్రబాబుకు ఆరో స్థానం- పవన్‌కు 10th ప్లేస్- లోకేష్ పరిస్థితి ఏంటీ?
రెవెన్యూ సమస్యలకు చెక్
రాష్ట్రంలో అత్యధిక సమస్యలు రెవెన్యూ శాఖలోనే ఉన్నాయని భావించిన రాష్ట్రప్రభుత్వం...ఇటీవలే రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. సమస్యలన్నీ క్రోడీకరించిన పిదప పరిష్కార మార్గాలను వేగవంతం చేయాలన్న దానిపై కేబినెట్‌లో చర్చించారు. గతంలో ఆర్డీవో స్థాయిలో ఉండే అప్పీలు విధానాన్ని వైసీపీ ప్రభుత్వం డీఆర్వోకు అప్పగించిందని...పని ఒత్తిడి కారణంగా ఫైళ్లన్ని పెండింగ్‌లో ఉన్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. దీంతో గతంలో మాదిరిగానే తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మళ్లీ ఆర్డీవో(RDO)కు అప్పీలు చేసుకునేలా అధికారాలను అప్పగించారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన వాట్సప్(Whatsaap) గవర్నెన్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని...దీన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమపథకాలపైనా ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉందని..దీన్ని మరింతగా కొనసాగేలా చూసే బాధ్యత మంత్రులదేనన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్కాస్ రద్దు చేయాలని మంత్రులు సూచించారు.
పెండింగ్ బిల్లులకు మోక్షం
గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులకు ఎట్టకేలకు గుత్తేదారులకు చెల్లింపులు చేయనున్నారు. 2014-19 మధ్య కాలంలో నీరు-చెట్టు పథకం కింద పెద్దఎత్తున పనులు చేపట్టారు.ఎక్కువ మంది టీడీపీ క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలే ఈ పనులు చేశారు. అధికారం మారడంతో జగన్ వీరికి ఇవ్వాల్సిన బిల్లులన్నీ నిలిపివేశారు. వీరందరికీ చెల్లింపులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సుమారు రూ.900 కోట్లు బకాయిలు చెల్లించనున్నారు. పునరుత్పాద ఇంధనం, గ్రీన్ ఎనర్జీలో సుమారు రూ.10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని...వాటన్నింటినీ అమల్లోకి తీసుకొస్తే...7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రులంతా వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూర్యఘర్, కుసుమ పథకాలను పెద్దఎత్తున వినియోగించుకోవాలన్నారు. ఏడాదిలో 10 లక్షల మంది లబ్ధిదారులకు అందజేసి దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలవాలని సీఎం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న సీఎం...అవసరమైతే తగ్గించడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూమలుు పరిశీలించి...అక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రయత్నించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. 2028 నాటికి బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.