Vasireddy Padma is likely to join TDP: వైసీపీ హయాంలో ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా పని  చేసిన వాసిరెడ్డి పద్మ హఠాత్తుగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆమెకు ఎలాంటి పదవి లేకపోవడం.. రాజకీయ భవిష్యత్ పై వైసీపీ ఎలాంటి భరోసా కల్పించకపోవడంతో రాజీనామా చేశారు. వెంటనే జగన్ పై , వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సాధారణంగా మంచి వాగ్దాటి ఉన్న ఆమె .. దాదాపుగా నాలుగేళ్ల పాటు కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చిన పార్టీపై ..లీడర్ పై ఇలా ఎటాక్ చేయడం  రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచేదే. ఏదో రాజకీయ పార్టీతో చర్చలు జరపకపోతే ఆమె ఇంత కాన్ఫిడెంట్ గా రాజకీయాలు చేయరని అనుకుంటున్నారు. అయితే ఆమె ఎ రాజకీయ పార్టీతో చర్చలు జరిపారో మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదు. తన రాజకీయ నిర్ణయంపై వారంలో ప్రకటిస్తానని అంటన్నారు. 


విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో చర్చలు ?


విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తమ కుటుంబానికి ఆప్తులని వాసిరెడ్డి  పద్మ అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో చేరడానికి  ఆమె కసరత్తు చేసుకుంటున్నారని వారంలో చర్చలు పూర్తి చేసుకుని పార్టీలో చేరిపోతారని అంటున్నారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల చంద్రబాబుకు క్షమాపణలు కూడా చెప్పారు. వైసీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజకీయంగా ఆమె  ఓవరాక్షన్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమెను టీడీపీలోకి ఎందుకు తీసుకంటారని సోషల్ మీడియాలో చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలో వాసిరెడ్డి పద్మ గతంలో జరిగి వాటికి క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. టీడీపీలోకి రూట్ క్లియర్ చేసుకోవడానికే ఆమె ఈ ప్రకటన చేశారని అనుకుంటున్నారు. 


టీడీపీకి మంచి వాయిస్ ఉన్న మహిళా నేతల కొరత


తెలుగుదేశం పార్టీలో ప్రతిభావంతులైన మహిళా నేతలు ఉన్నారు. మంచి వాయిస్ ఉన్న వంగలపూడి అనిత హోం మంత్రి అయ్యారు. దీంతో ఆమె పార్టీ తరపన తన వాయిస్ వినిపించడానికి పెద్దగా సమయం ఉండే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో మంచి వాగ్దాటి ఉన్న మహిళ  నేత కోసం టీడీపీ చూస్తోంది. ఆ లోటును వాసిరెడ్డి పద్మ భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. టీడీపీలో  కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి  మాధవి కూడా తరచూ మీడియా ముందుకు వచ్చి  పార్టీ వాదన వినిపిస్తున్నారు. అయితే కడప ఎమ్మెల్యేగా ఆమె బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో  పార్టీ కోసం ఫుల్ టైం పని చేసేలా వాసిరెడ్డి పద్మ లాంటి నేత అవసరం అని టీడీపీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 



Also Read: Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్




వాసిరెడ్డి పద్మ గతంలో పీఆర్పీలో పని పనిచేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ విధానాల ప్రకారం ఆమె చేసిన వ్యాఖ్యలు, తీసుకన్న చర్యలతో జనసేన క్యాడర్ లో  ఆమెపై వ్యతిరేకత ఉంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. జనసేనకూ మంచి వాయిస్ ఉన్న  మహిళా నేతల అవసరం ఉంది. ఆమె ఏ పార్టీతో టచ్ లో  ఉన్నారన్నది మరో వారం రోజుల్లో తేలే అవకాశం ఉంది. వైసీపీలో పని  చేసి రావడం వల్ల అక్కడి విషయాలన్నీ తెలుస్తాయని ఘాటుగా వైసీపీకి కౌంటర్ ఇస్తారని అనుకుంటున్నారు. ఆ విషయంలో నిరాశ పర్చబోనని ఇప్పటికే డిబేట్లలో పాల్గొంటూ వాసిరెడ్డి పద్మ సంకేతాలిస్తున్నారు.