వైసీపీని ప్రతిపక్షాల కన్నా ఇంటిపోరే ఎక్కువగా ఇరుకున పెడుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం అని జగన్ తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఆపార్టేకే ఎక్కువ నష్టం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకోవాలనుకున్న జగన్‌కి సొంత పార్టీ నేతల తీరే తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. సమస్యలపై ఆయా నేతలతో కలిసి చర్చించిన ఫలితం లేకుండా పోతోంది.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి తన మాటలతో హాట్ టాపిక్‌గా మారారు. పెద్దరికంతో రాజకీయాలు చేసే రోజులు పోయాయని ఇప్పుడు రౌడీలను వెంటేసుకొని సొంత ఇమేజ్ కోసం ప్రయత్నించే వారే రాజకీయాల్లో రాణిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్దగా ఆసక్తి కలిగించకపోయినా ఆయన మాట్లాడిన మరికొన్ని మాటలు విపక్షాలకు అవకాశంగా మారాయి. జగన్ ప్రభుత్వం రాజకీయకక్షతో అక్రమ కేసులు బనాయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ మాటలు నిజమేనన్నట్లు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ మూడున్నరేళ్లల్లో ఏనాడు అనవసరంగా ఏ విపక్ష నేతపై రాజకీయకక్ష సాధింపుగా కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
తన తండ్రి టిడిపి ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంపైనా స్పందించారు వసంత కృష్ణ ప్రసాద్. 55ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కావడంతో వ్యక్తిగతంగానే ఈ భేటీ జరిగిందని చెబుతూ నాని కూతురి పెళ్లికి కొన్ని కారణాల వల్ల నాన్నగారు హాజరుకాలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వ్యాఖ్యలతో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ జగన్ కి తలనొప్పిగా మారారు. అయితే వైసీపీని వీడి టిడిపిలో చేరేందుకే వసంత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న వార్తలపై కూడా మొన్నా మధ్య జగన్‌తో భేటీ అనంతరం క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ తో భేటీ అనంతరం కూడా వసంతలో ఏ మార్పు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హాట్ హాట్ గా మారుతున్న నెల్లూరు వైసీపీ రాజకీయం.
వసంత మాత్రమే కాదు ఇటు నెల్లూరు జిల్లా రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కూడా అదే తీరుని కనబరుస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆయన నివాసంలో కలవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వెంకయ్య ఆహ్వానం మేరకు కోటం రెడ్డి వెళ్లారా లేదా అన్నదానిపై చర్చనడుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని కోటం వర్గీయులు చెబుతున్నప్పటికీ కారణం ఏదో ఉందన్న టాక్ వినిపిస్తోంది. వెంకయ్య నెల్లూరు జిల్లా వ్యక్తి కావడంతో పాటు సీనియర్ పొలిటికల్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నా రానున్న ఎన్నికల టైమ్ ని దృష్టిలో పెట్టుకొని భిన్న కథనాలు హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన ఆనం రామనారాయణ తిరుగుబాటు ఎగరేస్తే ఇప్పుడు కోటం రెడ్డి భేటీలతో జిల్లా రాజకీయాల్లో కలవరం రేపుతున్నారు. ఆనం వ్యాఖ్యలతో మండిపడ్డ అధినేత జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఇప్పుడు వసంత వ్యాఖ్యలతో ఆయనకెలాంటి ఊస్టింగ్ వస్తోందన్న టాక్ మొదలైంది. అలాగే కోటం రెడ్డి కూడా పార్టీ షాకిస్తుందా అన్నది ఆసక్తిని రేపుతోంది.