Telangana cabinet Unity Doubt: మంత్రివర్గంలో ముఖ్యమంత్రే కీలకం. ఆయన నియమించిన వారు మాత్రమే మంత్రులు. ఆయన విశ్వాసం కోల్పోతే మంత్రి పదువులు ఉండవు. అలాగే ముఖ్యమంత్రిపై విశ్వాసం కోల్పోయిన మంత్రులూ కేబినెట్‌లో ఉండలేరు. కానీ తెలంగాణ కేబినెట్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అటు ముఖ్యమంత్రిపై నమ్మకం కోల్పోయిన మంత్రులు..ఇటు ముఖ్యమంత్రి కూడా నమ్మక కోల్పోయిన మంత్రులు కనిపిస్తున్నారు. కానీ ఎవర్నీ ఎవరూ కదిలించలేకపోతున్నారు. దీంతో కేబినెట్ లో విబేధాలపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
కేబినెట్ సమావేశాల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయన్న ప్రచారం
మంత్రి వర్గ సమావేశాల్లో సాధారణంగా ఏం జరుగుతుందనేది బయటకు రాదు. కానీ లీకుల ద్వారా.. ఇలా జరిగిందన్న విషయం మాత్రం చాలా మందికి తెలుస్తుంది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని అంశాల్లో మంత్రుల మధ్య వాగ్వాదం జరుగుతోందన్న ప్రచారం ప్రారంభమయింది. ఏ ఏ అంశాలపై అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయబేధాలున్నాయని.. ..ఈ కారణంగా దూరం పెరిగిందని చెబుతున్నారు. ఇటీవల జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ లో ఓ టెండర్ విషయంలో పెద్ద వివాదం రేగింది. దానికి సంబంధించిన ఫైల్ సీఎం వద్దనే ఉందని చెబుతున్నారు. ఈ వివాదంలో ఓ ఐఏఎస్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారు.
వరుస వివాదాల్లో మంత్రులు
మంత్రులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సహచర మంత్రిని సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్.. మీడియా సమావేశంలో కించ పర్చిన అంశం పెద్ద ఇష్యూ అయింది. ఆ మంత్రి హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. చివరికి పొన్నంతో క్షమాపణ చెప్పించారు. తర్వాత వివేక్ తోనూ మరో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు సరిపడలేదు.ఇక కొండా సురేఖ గురించి చెప్పాల్సిన పని లేదు. పదవి చేపట్టినప్పటి నుండి ఆమె వివాదాల్లోనే ఉన్నారు. ఇటీవల ఆమె కుమార్తె స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులపై ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల అలాంటి వారు కూడా సీఎం చుట్టూ కనిపించడం లేదు.
మంత్రుల పనితీరునూ పట్టించుకోని ముఖ్యమంత్రి
మంత్రులు ఇలా గాడి తప్పుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి పనితీరుపై లేధా వారు నిర్వహిస్తున్న శాఖల్లో పురోగతిపై ఇప్పటి వరకూ ఎలాంటి సమీక్షలు చేయలేదు. ఆయా శాఖల పనితీరునూ కనీసం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ప్రభుత్వంపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నా మంత్రులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. చాలా పరిమిత మంది మాత్రమే విపక్షాలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. మిగతా అందరూ ఎందుకు మాట్లాడటం లేదంటే.. మాకు ఎందుకు అన్న పద్దతిలో ఉంటున్నారు. ఫలానా అంశంపై స్పందించాలని.. విపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వాలని గట్టిగా చెప్పలేకపోతున్నారు సీఎం రేవంత్.
మంత్రులకూ హైకమాండ్ వద్ద పలుకుబడి
తెలంగాణ కేబినెట్ లో ఈ పరిస్థితి రావడానికి హైకమాండ్ కుడా ఓ కారణం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్తి అధికారం ఇవ్వలేదు. తనపై పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసిన మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని హైకమాండ్ పట్టించుకోేలేదని.. పైగా రాజీ చేసిందని అంటున్నారు. ఎవరూ తన మాట వినకపోతూండటంతో.. సీఎం కూడా తన పని తాను చేసుకుని పోతున్నారని చెబుతున్నారు. కీలక అధికారుల బదిలీల విషయంలోనూ హైకమాండ్ నుంచే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పోలీసు అధికారుల బదిలీల్లోనూ ఇదే జరిగిందని అంటున్నారు. సీఎం రేవంత్ మంత్రి వర్గంపై సీఎం పట్టు సాధించలేకపోవడానికి హైకమాండ్ అధిక జోక్యమే కారణమని గుసుగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. తెలంగాణ మంత్రివర్గం మాత్రం.. సీఎం గ్రిప్ లో లేదని అర్థమైపోతుంది.