Vizag Google AI HUB:  గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌ వైజాగ్‌లో ఎంటరవుతోంది. ఇంటర్నెట్ ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది.  ఇంతవరకూ అమెరికా బయట గూగుల్ ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయలేదు.  ఏకంగా లక్షా 30వేల కోట్ల పెట్టుబడి వస్తున్నట్లు ప్రకటించింది.  ఇంత పెద్ద సంస్థ అంత పెద్ద పెట్టుబడిని  పెడుతుంటే.. అది రాష్ట్రానికి గర్వకారణంగానే ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టుపై సంబరం ఎంతుందో ఆందోళన కూడా అదే స్థాయిలో ఉంది. 

Continues below advertisement

ఒక బిగ్ జెయింట్ వచ్చినప్పుడు.. ఎలాంటి ఎకోసిస్టమ్ వస్తుందన్న దానికి హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్ ఉదాహరణగా ఉంది. ఇప్పుడు అదే సిమిలారిటీ వైజాగ్‌లో కనిపిస్తోంది. కానీ మరి అలాంటి డవలప్‌మెంట్ ఇక్కడ వస్తుందా..? ప్రభుత్వం చెప్పే ఉద్యోగాలు రావు అని, పర్యావరణపరంగా సమస్యలు అని.. ఈ ప్రభుత్వం గూగుల్‌ను రప్పించడం కోసం ఉదారంగా చాలా తాయిలాలు ఇచ్చేసిందని.. ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పుడు.. ప్రభుత్వం వైపు నుంచి దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గూగుల్ రాకపై అధికార ప్రకటన వచ్చింది, ఆ తర్వాత సంబంధిత మంత్రి లోకేష్ మీడియా సమావేశంలో చాలా విషయాలు చెప్పారు. అయినా కానీ కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. 

1. అన్ని ఉద్యోగాలు వస్తాయా..? లక్ష కోట్లకు పైగా పెట్టుబడి అంటే.. ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉండాలి కదా.. ప్రభుత్వం ఏకంగా 1.8లక్షల ఉద్యోగాలు వస్తాయంటోంది.  దీనిపైనే ఎక్కువ సందేహాలున్నాయి. మామూలుగా ఓ డేటా సెంటర్‌లో 200 కు మించి శాశ్వత ఉద్యోగాలు ఉండవని లెక్కలు చెబుతున్నాయి. పరోక్ష ఉద్యోగాలు ఓ 600 ఉంటాయి. అంటే మొత్తం 1000కి మించి వచ్చే అవకాశం లేదు. నిర్మాణ సమయంలో 20వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఉంటాయి.  YSRCP ప్రభుత్వంలో అదానీ సెంటర్‌ 300 మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్నప్పుడు.. ౩9వేల ఉద్యోగాలు వస్తాయని స్వయంగా అప్పటి సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు వస్తోంది.. దానికి ౩రెట్లు ఉంది. అంటే లక్షా 20వేల ఉద్యోగాలు రావాలి. YSRCP ఇప్పుడు చెబుతోంది ఏంటంటే.. డేటా సెంటర్‌తో పాటు.. ఐటీ పార్క్, స్కిల్ యూనివర్సిటీ కూడా ఉంది అందుకే అన్ని ఉద్యోగాలు చెప్పామంటోంది. అప్పటి ఐటీ మంత్రి  గుడివాడ అమరనాథ్ ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నారు. కానీ అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రభుత్వం నుంచి అధికారికంగా క్లారిటీ ఇవ్వడం లేదు. డేటా సెంటర్ కాకుండా ఇంకేమైనా వస్తాయా..?

Continues below advertisement

2.  భూమిపై స్పష్టత ఏది..?డేటా సెంటర్‌ కోసం తుర్లవాడలో 200 ఎకరాలు, ఆనందపురం ముడసర్లోవలో 100 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాలు తీసుకున్నారు. ఈ మూడూ ఒకచోట లేవు. ఈ మూడు చోట్ల కలిపి క్లస్టర్ వస్తోందా.. లేదా వేరు వేరు ప్రాజెక్టులా.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 

3. పర్యావరణ అనుమతులు- ప్రభావంఏ పెద్ద ప్రాజెక్టు రావాలన్నా ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జరగాలి. EIA అంటారు... ఈ ప్రాజెక్టు కోసం ఆ అసెస్‌మెంట్ జరిగిందా.. జరిగితే దాని ఇంపాక్ట్ ఏంటి.. అన్నది ఎక్కడా పబ్లిక్‌ డాక్యుమెంట్ లేదు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావం ఏంటన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. పర్యావరణ ప్రభావ అంచనా కోసం పబ్లిక్ హియరింగ్ జరపాలి. బహుశా దానిని ముందు ముందు నిర్వహిస్తారా లేక అన్ని అనుమతులు ఇచ్చేశారా... దీని గురించి చెప్పడం లేదు.  ప్రాజెక్టుకు సంబంధించిన ఏ నివేదికలు బయట పెట్టడం లేదు కాబట్టి భూ కేటాయింపులు రద్దు చేయాలని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ HRF డిమాండ్ చేస్తోంది. 

4. భారీగా ఇన్సెంటివ్‌లు ఇచ్చారా..? గూగుల్‌ లాంటి  భారీ ప్రాజెక్టును ఆకర్షించడానికి ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏం తప్పు లేదు. చాలా సందర్భాల్లో సంప్రదింపుల ద్వారా ఇది జరుగుతుంది. ఒక్కో సందర్భంలో ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీసుకురావడానికి.. ఇతర రాష్ట్రాలతో పోటీని తట్టుకోవడానికి ఎక్కువుగానే రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గూగుల్‌తో వస్తున్న లాభం కంటే.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలే ఎక్కువ అని విమర్శలు వచ్చాయి. కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే.. ఏపీ ప్రభుత్వం 22వేల కోట్ల రాయితీలు ఇచ్చిందని.. చెప్పారు. ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితికి అంత అవసరమా.. ఇది రైట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు అని ఆయన విమర్శించారు. గూగుల్‌కి ఏమిచ్చారు అన్నది స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. మనీ కంట్రోల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో లోకేష్‌ మాత్రం భూమిని ఊరికే ఇవ్వలేదని మార్కెట్‌ ప్రైస్‌లో కొంత డిస్కౌంట్‌ ఇచ్చామని చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భూమి విలువలో 25శాతం, కమర్షియల్ విద్యుత్‌లో యూనిట్‌కు ఒక రూపాయి... స్టేట్‌ జీఎస్టీ SGST లో పూర్తిగా మినహాయింపు, స్టాంప్‌ డ్యూటీ, ఎలక్టిసిటీ డ్యూటీ మినహాయింపులు ఇఛ్చారని చెబుతున్నారు. దీని ద్వారా వచ్చే లాభం Incentive లను మించి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. మిగతా రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రాయితీలు లేవని చెబుతున్నారు. 

5. డేటా సెంటర్‌ వస్తే.. వైజాగ్ కు నీళ్లు ఉండవా..? ఇప్పుడు ప్రజల్లో ఆందోళనకు కారణమైన అంశం ఇది. ఇతర దేశాల్లో డేటా సెంటర్లపై వ్యతిరేకత ఉందని.. దీనికి భారీ ఎత్తున నీళ్లు అవసరం అవుతాయని..  వైజాగ్‌లో డేటా సెంటర్ చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటి పోతాయని.. అక్కడ భూములు కొనొద్దని చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ డేటాసెంటర్‌కు   ఎంత నీరు అవసరం అవుతుందన్న డాక్యుమెంట్ లేదు. అయితే ఓపెన్‌ AI సోర్సుల ద్వారా అంచనా కట్టింది ఏంటంటే.. గూగుల్ డేటా సెంటర్‌కు ప్రతిరోజూ 11-19 మిలియన్ లీటర్ల నీరు అవసరం అని లెక్క గట్టారు. వైజాగ్ కు సరిపడా నీరు అవసరం అవుతుందా అని పరిశీలిస్తే.. అంత ఉండకపోవచ్చు. విశాఖపట్టణానికి ప్రతిరోజూ 400 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం అవుతోంది. ఏడాదికి 146 బిలియన్ లీటర్లు అవసరం.. డేటా సెంటర్‌కు ఏడాదికి 4-7 బిలియన్ లీటర్లు అవసరం. విశాఖ అవసరాల్లో 3-5% అవసరం అవుతుందని అర్థం అవుతోంది.  ఈ లెక్కల ప్రకారం ఏడాదికి  0.25TMC అవసరం. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. ఇది గోదావరి నుంచి ఇస్తామని చెబుతున్నారు కానీ.. ఏంత అనే క్లారిటీ లేదు. 

6. వైజాగ్‌కు సరిపోయే కరెంట్‌... ఒక్క డేటా సెంటర్‌కే కావాలా..? ఇది మరో ముఖ్యమైన విషయం. దీనిపై కూడా ప్రభుత్వం నుంచి ఎంత అవసరమో చెప్పలేదు. ఓపెన్ సోర్సులో ఉన్న సమాచారం ప్రకారం  1 GW డేటా సెంటర్‌ను ఒక గంట నిర్వహించాలంటే.. 1 GW విద్యుత్ అవసరం.  ఇది ఒక రోజుకు 24 మిలియన్ వాట్ అవర్ అవసరం అవుతుంది.  వైజాగ్ సిటీ మొత్తం ఉపయోగించేది రోజులు 18 మిలియన్ వాట్ అవర్.  అంటే  వైజాగ్ వాడే విద్యుత్ కంటే.. 30శాతం ఎక్కువ. ఈ లెక్కలు కరెక్టు అని కాదు.. అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే. అయితే దీనిపై లోకేష్ ఓ క్లారిటీ ఇచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. ఎంత విద్యుత్ అవసరమో చెప్పలేదు కానీ.. ఆ విద్యుత్ మొత్తం రెన్యువల్ ఎనర్జీ.. అంటే సోలార్, విండ్, Pumped, Battery స్టోరేజ్ ద్వారా చేస్తామన్నారు. ప్రత్యేకమైన గ్రిడ్ ఏర్పాటుకు గూగుల్ పెట్టుబడి పెడుతుందని.. ఆ విద్యుత్‌లో తాము డిస్కౌంట్ ఇస్తామని లోకేష్ చెప్పారు. అయితే ఈ గ్రిడ్ ద్వారా వచ్చే విద్యుత్ సరిపోతుందా.. పీక్ అవర్స్ లో సరిపోకపోతే.. థర్మల్ విద్యుత్ వాడాల్సి ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై స్పష్టత లేదు, 

7.పెట్టుబడి ఎలా పెరిగింది.. ? మిగిలిన కంపెనీలు ఎందుకు చేరాయి.? గూగుల్ విషయంలో మరో విమర్శ.. ఇది చాలా రహస్యంగా ఉంచడం గురించి. పెట్టుబడులు కన్‌ఫామ్ అయ్యే వరకూ రహస్యంగా ఉంచడం అనేది వ్యూహాత్మక నిర్ణయమే. కానీ పారదర్శకతపై సందేహాలు వస్తున్నప్పుడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. గూగుల్ పెట్టుబడి పెట్టడానికి ముందు రోజు కూడా ప్రభుత్వ అధికారిక ప్రెస్‌నోట్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి అన్నారు. కానీ.. ఒప్పందం కుదిరిన తర్వాత.. అది 15 బిలియన్ డాలర్లు అని చెప్పారు. ఏకంగా 40వేల కోట్ల పెట్టుబడి పెరిగి పోయింది. ఒక్క రోజులో అంత పెరుగుదల ఎలా సాధ్యం అయింది.? గూగుల్‌తో పాటు.. అదానీ, ఎయిర్‌టెల్ చేరాయి. ఇదంతా ఎలా జరిగిందన్న విషయంలో పారదర్శకత లేదన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. 

 ఇవి కాకుండా.. డేటా సెక్యూరిటీ.. డేటా సావరినీటి వంటి విషయాలపైనా చర్చ జరుగుతోంది. అయితే ఇండియాకు సంబంధించిన డేటా దేశం దాటి పోదని.. ఆ విషయంలో చట్టపరమైన రక్షణ ఉందని లోకేష్ చెప్పారు. కానీ పైన చర్చించిన మిగిలిన విషయాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు.

END