ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్య‌మంత్రిగా పని చేసిన న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి కేంద్రమంత్రి కండువా కప్పి సభ్యత్వ కార్డు ఇచ్చారు.   


ఎంతో గొప్ప పొలిటికల్‌ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కిరణ్‌ కుమార్‌రెడ్డి బీజపీలో చేరడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు ప్రహ్లాద్ జోషి. ఆయన రాకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీకి మరింత బూస్టప్ వచ్చినట్టు అవుతుందన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు ప్రహ్లాద్ జోషి. స్వతహాగా క్రికెటర్ అయిన కిరణ్‌ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇన్నింగ్స్ ప్రారంభించారని... ఇకపై ఏపీలో బ్యాటింగ్‌ జోరందుకుంటుందని అన్నారు.  






ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్య‌మంత్రిగా పని చేసిన న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కీలక బాధ్యతలు అప్ప‌గిస్తామ‌ని బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన‌ హామీతోనే ఆయన పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, శాస‌న‌స‌భ‌ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. రోశ‌య్య అనంత‌రం 2010 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. 






రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కిర‌ణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి 2014లో జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత‌ పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశించినా.. ఎందుకో అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు. నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ ఇప్ప‌ట్లో పుంజుకునే అవకాశాలు లేకపోవడంతో మార్చి 11న రెండోసారి రాజీనామా చేశారు. 
బీజేపీ అధిష్ఠానంతో కిరణ్‌కుమార్ రెడ్డి అనేకసార్లు చర్చలు జరిపారు. జాతీయస్థాయిలో ఆయనకు కీలక పదవికి అప్పగించేందుకు హామీ ఇచ్చిన త‌ర్వాత‌.. ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు. ఇవాళ బీజేపీలో చేరారు. ప్రహ్లాద్‌ జోషీ ఆయనకు సభ్యత్వ కార్డు ఇచ్చారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.