Kiran Kumar Reddy:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్య‌మంత్రిగా పని చేసిన న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేర‌నున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఢిల్లీలో ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు. కాగా.. కొన్ని రోజుల క్రితం ఆయ‌న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కీలక బాధ్యతలు అప్ప‌గిస్తామ‌ని బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన‌ హామీతోనే ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం సాగుతోంది.


ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, శాస‌న‌స‌భ‌ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. రోశ‌య్య అనంత‌రం 2010 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. 


రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కిర‌ణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి 2014లో జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత‌ పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశించినా.. ఎందుకో అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు. నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ ఇప్ప‌ట్లో పుంజుకునే అవకాశాలు లేకపోవడంతో మార్చి 11న రెండోసారి రాజీనామా చేశారు. 






బీజేపీ అధిష్ఠానంతో కిరణ్‌కుమార్ రెడ్డి అనేకసార్లు చర్చలు జరిపారు. జాతీయస్థాయిలో ఆయనకు కీలక పదవికి అప్పగించేందుకు హామీ ఇచ్చిన త‌ర్వాత‌.. ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఆహ్వానంతో ఆ పార్టీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమయ్యారు. అయితే ఏపీకి ఆయన సేవలను పరిమితం చేస్తారా? తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా.. కిర‌ణ్‌కుమార్‌ రెడ్డి ఎంట్రీ బీజేపీకి ఏ విధంగా క‌లిసొస్తుంద‌నే విష‌యం ఆసక్తికరంగా మారింది.


బీజేపీలోకి కిరణ్‌కుమార్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు బీజేపీ లీడర్‌ విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్ చేశారు. బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు అధికారింగా ధ్రువీకరించారు. కలిసి పని చేద్దామంటూ చెప్పుకొచ్చారు.