AP Governer :    ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ పాలనపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టిసారించా రు.  ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సమాచారం పంపారు. ప్రతీ నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖకు సంబంధించి ప్రతి నెలా జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికల ఆధారంగానే తాను రిపోర్టులు తయారు చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంది.  ప్రతీ నెలా రిపోర్టులు అడుగుతున్నందున… అన్ని అంశాలపై గవర్నర్‌కు స్పష్టత ఇవ్వాల్సిందేనని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  


ప్రభుత్వం నుంచి  ప్రతి నెలా రిపోర్టు కావాలంటున్న ఏపీ గవర్నర్


మొన్నటి వరకూ ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెలవారీ నివేదికలు అడగలేదు.   గత నెల 29న గవర్నర్‌ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి నివేదిక పంపాల్సి ఉన్నందున ప్రతి నెలా 3లోగా ఆయా అంశాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. మరో రెండు రోజులు అదనపు సమయం తీసుకోవచ్చు తప్ప అంతకు మించి జాప్యం చేయవద్దంటూ రాజ్ భవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయంటున్నారు. గవర్నర్‌ కార్యాలయం నుంచి ఈ తరహా ఆదేశాలు రావడం అధికారవర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. 


అన్ని శాఖల నుంచి సమగ్ర సమాచారం ! 


రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, కీలక రంగాల్లో అభివృద్ధి వంటి అంశాపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ప్రాథాన్యతా స్కీముల వివరాలు అడిగారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రజలపై ప్రభావం వంటి అంశాలను పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో సాధించిన వృద్ధిపై నివేదిక కోరారు. నీటి పారుదల రంగంలో పరిస్థితులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంతో పాటు వైద్య సేవలు, సామాజిక ఫెన్షన్లు, నిత్యావసర సరుకుల పంపినీ, విద్యుత్‌ సరఫరా, ఇంధన రంగం వృద్ధి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, ఎస్సీ, ఎస్టీల కేసుల నమోదు వంటి పలు అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో పేదలకు గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన చర్యలు, పిల్లలు, మహిళల సంక్షేమ పథకాలు, బాలికా విద్య, వికలాంగుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆ నివేదికలో పొందుపరచాలని గవర్నర్ ఆదేశించారు. 


గవర్నర్ ఇలాంటి నివేదికలు ఎందుకు కోరారు ? 


రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రాథాన్యతలు, పాలనాపరమైన అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నెలవారీ నివేదిక కోరడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధారణ వ్యవహారంగానే కొందరు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌ నివేదిక ఇవ్వడమనేది పాలనాపరమైన అంశంలో భాగమేనని చెపుతున్నారు. అయితే వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడంలో భాగమని భావిస్తున్నారు. మరో వైపు పొరుగు రాష్ట్రాల్లో తరుచూ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య పేచీలు తలెత్తుతున్నందున ఈ తరహా ఘటనలకు ఆస్కారం లేకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడంలో భాగమై ఉండొచ్చంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. కొందరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గవర్నర్‌ కార్యాలయం స్పందించడం కీలకంగా చెప్పొచ్చు. 


గవర్నర్ కీలక నిర్ణయాలు తీసుకుంటే వివాదం ఏర్పడుతుందా ?  


నిజానికి బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటేనే ..  అక్కడ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఉన్న వివాదం ఇంకా తేలలేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కానీ ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంది. అందుకే గత గవర్నర్ నుంచి ఎలాంటి సమస్యలూ రాలేదు. ప్రస్తుత గవర్నర్ నుంచి కూడా రావని అడిగిన సమాచారం ఇస్తే ఇబ్బందేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.