Nakka Anand Babu: ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడిన మాటలు వింటూ దెయ్యాలు కూడా సిగ్గుపడతాయన్నారు. సభలో జగన్ చెప్పిన మాటలను విన్న జనమంతా పగలబడి నవ్వుకున్నారని నక్కా ఆనంద్ బాబు సెటైర్లు వేశారు. 


సీఎం మాటలకు జనం నవ్వుకుంటున్నారు! 
సీఎం జగన్ చిలకలూరి పేట సభలో ప్రసంగించిన తర్వాత టీడీపీ పార్టీ కార్యాలయంలో నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై విమర్శలు చేశారు. పొత్తులు, జిత్తులు, ఎత్తులు, కుయుక్తులు అని జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు రాష్ట్ర జనం నవ్వుకుంటున్నారని ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గొడ్డలి వేటు కుయుక్తులు, గుండె పోటు ఎత్తులు జగన్ మోహన్ రెడ్డికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదని నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. 


'జగన్ అలా అనడం హాస్యాస్పదంగా ఉంది' 
కోడి కత్తి వ్యవహారం జిత్తుల మారి వ్యవహారం కాదా అని ఆనంద్ బాబు నిలదీశారు. తండ్రి అధికారంలోనే లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి అర్ధబలం, అంగబలం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ పరదా లేకుండా ఎక్కడికి ప్రయాణించరని, అలాంటి వ్యక్తి ప్రజలతోనే పొత్తు అంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఆనంద్ బాబు అన్నారు. 


'తల్లితో, చెల్లితో పొత్తులేని వ్యక్తి జగన్' 
తల్లితో, చెల్లెలితో, బాబాయి కూతురితో కూడా పొత్తులేని జగన్ మోహన్ రెడ్డి.. మానవ సంబంధాలు అంటూ వేదాలు వల్లించడం ఏంటని ప్రశ్నించారు. సొంత మీడియాతో పాటు అర్థబలంతో అంగబలంతో మరిన్ని మీడియాలను గుప్పెట్లో పెట్టుకున్న జగన్.. తమకు మీడియా సహకారం లేదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మిన వారిని నట్టేట ముంచడమే జగన్ మోహన్ రెడ్డి నిజస్వరూపమని, ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకూ బాగా తెలుసని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. 


'జగన్ ను గద్దె దించేందుకు జనాలు సిద్ధం'


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా.. పచ్చగా చెట్లతో ఉండే ఆ ప్రాంతాల్లో ఒక్క చెట్టు కూడా కనిపించకుండా నరికివేస్తున్నట్లు నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మీడియా సపోర్డ్ లేదని పదే పదే జగన్ చెబుతున్నారని.. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఎవరివంటూ నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. సొంత న్యూస్ పేపర్, సొంత న్యూస్ ఛానల్ ఉన్న మొట్ట మొదటి ప్రాంతీయ పార్టీ వైసీపీనే అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలి, పాలన వైఫల్యాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.