Kishan Invites TDP :  ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించనున్న అల్లూరి సీతారారామజు విగ్రహా కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వాన లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు.  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమం లో భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు.  జులై 4వ తేదీన భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి టీడీపీ నుంచి ప్రతినిధిని పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును సర్మించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు.


పార్టీ తరపున ప్రజాప్రతినిధిని పంపాలని కోరిన కిషన్ రెడ్డి 


ఆహ్వాన లేఖ రాయడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీలో చర్చించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ... టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పంపాలని నిర్ణయించారు. దీంతో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమంలో సీఎం  జగన్‌తో పాటు ప్రతిపక్ష పార్టీ నుంచి అచ్చెన్నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవనున్నారు. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా  అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నిర్మించారు. దీన్ని ఆవిష్కరించేందుకు స్వయంగా ప్రధాని హాజరవుతారు. 


పార్టీలకు అతీతంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్


ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి ప్రజాప్రాతనిధ్యం ఉన్న అన్ని పార్టీలకూ ఆహ్వానం పంపుతున్నట్లుగా చెబుతున్నారు.  రాజకీయాలకు అతీతంగా స్వతంత్రం కోసం పోరాడిన వారిని గౌరవించుకోవడం కోసమే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


నర్సాపురం ఎంపీ రఘురామ కూడా హాజరయ్యే అవకాశం


అయితే ఏపీలో ఎప్పుడూ పొలిటికల్‌గా హై టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటినీ రాజకీయంగానే చూస్తూంటారు. ఈ కారణంగా టీడీపీకి ఆహ్వానం పంపడం కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు కూడా హాజరవుతామని అంటున్నారు.     అదే సమయంలో వేదికపై సీఎం జగన్‌తో పాటు టీడీపీ, చిరంజీవి వంటి వారు కూడా ఉండే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమంపై రాజకీయ ఆసక్తి కూడా ప్రారంభమయింది.