TRS Again Sentiment Plan : తెలంగాణలో ఎన్నికల వేడి అప్పుడే పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తమ తమ వ్యూహాలు ఖారారు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఈ విషయంలో కొంత క్లారిటీ ఉంటుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు ఓట్లుగా మల్చుకోవడమే వారి టాస్క్. దానికి వారు ఏ మార్గంలో వెళ్తారన్నది డిసైడ్ చేసేసుకున్నారు. వారి మార్గంలో వెళ్తున్నారు. అయితే అధికార పార్టీకి మాత్రం ఇప్పుడు తాము ఏ మాత్రంలో వెళ్లాలన్నది ఇప్పటి వరకూ ఓ చాయిస్‌గా ఉండిపోయింది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
రకరకాల ఫార్ములాలు వర్కవుట్ చేసిన కేసీఆర్ !
వచ్చే ఎన్నికల్లో ఏ అంశంపై పోటీ చేయాలన్నదానిపై ఇప్పటి వరకూ టీఆర్ఎస్ రకరకాల సమీకరణఆలపై వర్కవుట్ చేసింది. గత ఎన్నికలకు ముందు రైతు బంధు పథకాన్ని ఎలా ట్రంప్ కార్డ్‌గా ఉపయోగించుకున్నారో ఈ సారి అలాగే దళిత బంధును ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ హుజురాబాద్ మొత్తం అమలు చేసినా సరైన ఫలితం రాకపోవడంతో ఇప్పుడు అదొక్కటే సరిపోదని డిసైడయ్యారు. దళిత వర్గాన్ని గుంపగుత్తగా సపోర్టర్లుగా మార్చుకోవడంతో పాటు ఇతర సామాజిక సమీకరణాలు వర్కవుట్ చేసి వాటినే ఎజెండాగా చేసి వెళ్లాలనుకున్నారు. కానీ అనుకున్న ఫలితం రాలేదు. ఓ సారి రైతు అజెండాను హైలెట్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే అదీ వర్కవుట్ కాలేదు. దీంతో కేసీఆర్ ఇప్పుడు తీవ్రంగా ఆలోచించి పాత మార్గంలోనే పయనించాలని నిర్ణయించారు.
తెలంగాణ సెంటిమెంటే శ్రీరామరక్ష అనుకుంటున్నకసీఆర్ !
టీఆర్ఎస్ అనే పార్టీకి పునాది తెలంగాణ సెంటిమెంట్. ఇప్పుడు వట వృక్షలా ఎదగడానికి కూడా తెలంగాణ సెంటిమెంటే కారణం. ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించినా ఆ క్రెడిట్ తెలంగాణ సెంటిమెంట్‌దే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ .. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్న ఊపులో విజయం సాధించింది. రెండో సారి గెల్చినప్పుడు సెంటిమెంట్ లేదనుకున్నారు. కానీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. కేసీఆర్‌తో తానే పోటీపడుతున్నట్లుగా ప్రచారం చేయడంతో కేసీఆర్ ఆ అస్త్రాన్ని అందిపుచ్చుకున్నారు. సెంటిమెంట్‌తో ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు అప్పటి పరిస్థితులు లేవు. చంద్రబాబు లేరు. ఏపీ రాజకీయ పార్టీలు లేవు. మరి సెంటిమెంట్ ఎలా ? . అందు కోసమే కేసీఆర్ ఇంత వరకూ చేసిన ఢిల్లీ రాజకీయం అని అంచనా వేస్తున్నారు.
అప్పట్లో ఆంధ్రా పాలకులు.. ఇప్పుడు కేంద్ర పాలకులు !
తెలంగాణ ప్రజలు తాము వివక్షకు గురవుతున్నామని భావిస్తే సహించరు. కచ్చితంగా ఇదే పాయింట్ పట్టుకున్న కేసీఆర్ ఆంధ్ర పాలకులు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం చేశారని ఉద్యమాన్ని నిర్మించగలిగారు. ఇప్పుడు ఆంధ్ర అంశం తెలంగాణలో లేదు కాబట్టి... సెంటిమెంట్ కోసం కేంద్ర పాలకుల్ని చూపించాలని కేసీఆర్ వ్యూహం అమల్లో పెట్టినట్లుగా భావిస్తున్నారు. కొంత కాలంగా తెలంగాణ విషయంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు ఇదే అజెండాగా టీఆర్ఎస్ రాజకీయం ఉండే అవకాశం ఉంది.
అభివృద్ధి ప్రచారంతో కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం !
నిజానికి ఓ సందర్భంలో కేసీఆర్ .., తాము సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మూడోసారి పట్టం కట్టాలని అభ్యర్థించాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి సాధించింది. హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయాయి. విదేశీ లుక్ వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకే నీటి సమస్యను తీర్చేశారు. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను భారీగా కల్పించారు. ఎలా చూసినా టీఆర్ఎస్ సర్కార్ పనితీరు బెటర్ గా ఉంది. అయితే అభివృద్ధి అనేది ఎన్నికల్లో గెలవడానికి కొలమానం కాదని.. కొంత వరకూ హెల్ప్ చేయవచ్చు కానీ.. దానిపైనే ఆధారపడలేమన్న కారణంగా మళ్లీ సెంటిమెంట్ పైనే వర్కువుట్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
తెలంగాణ సెంటిమెంట్‌ను ఎన్నికల ఎజెండాగా పెట్టుకున్న ప్రతీ సారి టీఆర్ఎస్ ఘన విజయాలుసాధిస్తూ వస్తోంది. ఈ సారి కూడా అదే అస్త్రంరెడీ చేసుకుంటోంది. అయితే ఈ సారి టీఆర్ఎస్ రాజకీయంగా చూపించే విలన్ మాత్రం మారాడు. ఈ ఫైట్‌లో కేసీఆర్ విజయం సాధిస్తారా లేదా అన్నది ఎన్నికల తర్వాత తేలుతుంది.