వేములవాడ నుంచి నేనే చేస్తానంటూ ప్రకటించారు బీజేపీ లీడర్ తుల ఉమ. ఇది ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడికి తెలిసి చేశారా తెలియక చేశారా అనేది డిస్కషన్ పాయింట్. ఈ స్థానం నుంచి పోటీ చేసి తెలంగాణ రాజకీయాలు శాసించాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఓ టాక్ నడుస్తోంది. ఇంతలో ఉమ చేసిన ప్రకటన హాట్‌టాపిక్‌గా మారింది. 


సిద్దిపేటలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ తన పోటీ గురించి వివరించారట తుల ఉమ. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ సీటు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతలో తుల ఉమ స్టేట్‌మెంట్‌ ఆ జిల్లా నాయకుల్లో చర్చకు దారి తీసింది. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కన్నేసి ఉన్న ఈ సీటుపై తుల ఉమ చేసిన కామెంట్స్‌ బీజేపీలో హాట్‌టాపిగ్‌గా మారాయి. 


కరీంనగర్ రాజకీయాల్లో తుల ఉమది ప్రత్యేక ప్రస్థానం. వామపక్ష భావజాలంతో చిన్నవయసులోనే నక్సలైట్‌గా మారి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వేములవాడ అంతటా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న తుల ఉమ తన మనసులో మాట బయటపెట్టారు. టిఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామాతో అప్పట్లో ఆయన వెంట నడిచారు తుల ఉమ. బిజెపిలో జాయిన్ అవుతూనే తనకున్న రాజకీయ భవిష్యత్తుని కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. కీలక అనుచరులైన ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమకు కోరుకున్న నియోజకవర్గాల్లో టికెట్లు ఇప్పించుకోవాలని అప్పట్లో భావించారు ఈటెల. 


ఈటల రాజీనామా తర్వాత వెంటనే వచ్చిన హుజరాబాద్ ఉపఎన్నికల కారణంగా తన డిమాండ్‌ని బీజేపీ అధిష్ఠానానికి బలంగా వినిపించ లేదు. ఇక హుజురాబాద్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా తన పేరు మారు మోగడంతో ఈటలకు మరింత హైప్ వచ్చింది. బీజేపీలోనూ మంచి ప్రాధాన్యత దక్కింది. 


ఈటల తన అనుచరుల కోసం అడిగే ప్రయత్నంలో ఉండగానే కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సడెన్‌గా వేములవాడ నుంంచి పోటీ చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది. దీంతో తులఉమకి ఆశాభంగం తప్పదేమో అన్న అనుమానం అందరిలో ఏర్పడింది. ముఖ్యంగా మున్నూరు కాపుల ప్రాబల్యం బలంగా ఉండి ఆధ్యాత్మికంగా పేరున్న వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రపోషించాలని సంజయ్ ఆశించినట్టుగా భావించారు. 


ఇంతలోనే మరో యువ నాయకుడు పేరు కూడా బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ బీజేపీ నేత సి.హెచ్.విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ పేరు వినపడింది. కానీ ఎందుకో మళ్ళీ కొద్ది రోజులుగా మళ్లీ ఆ విషయంపై ఎవరూ నోరు మెదపలేదు. దీంతో ఈసారి వేములవాడ నుంచి బిజెపి టికెట్ ఎవరికి అనే సస్పెన్ష్‌ కొనసాగుతోంది. 


ఈ సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బిజీబిజీగా మారడం... మరోవైపు ఈటల రాజేందర్‌కి అత్యంత కీలకమైన చేరికల కమిటీకి సంబంధించి పదవి బీజేపీ పెద్దలు కట్టబెట్టడంతో తుల ఉమకి నమ్మకం కుదిరినట్టుగా తెలుస్తోంది. అదే ధీమాతో ఓ సమావేశంలో బహిరంగంగానే తాను రానున్న ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందనేది వచ్చే ఎన్నికల వరకూ వేచి చూడాలి.