BRS Back Track :   తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ముందు ఇప్పుడు పెసు సవాళ్లు ఉన్నాయి. ఓ వైపు కేంద్రంతో రాజకీయ యుద్ధంతో పాటు మరో వైపు దర్యాప్తు సంస్థలతోనూ పోటీ పడుతున్నారు. వీటితో పాటు పాలనా వ్యవహారాలు... చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీ సన్నాహాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం ఓ రేంజ్‌లో ఉండేలా చూసుకోవాలనుకుంటున్నా..  సన్నాహాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే.. వచ్చే నెల మొదటి వారంలో అంటే ఏడో తేదీలోపు టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ ఇంకా ఎలాంటి స్పష్టతకు రాలేకపోతున్నారు. 


ఢిల్లీలో బహిరంగసభ ఉన్నట్లా ? లేనట్లా ?


డిసెంబర్ ఏడో తేదీ లోపున తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారిపోతుంది. వెంటనే తొమ్మిదో తేదీన ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి విధి విధానాలు ప్రకటించాలని అనుకున్నారు. బీఆర్ఎస్ గురించి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో ప్రకటించాలనుకోవడం లేదు. అది జాతీయ స్థాయిలోనే ఉండాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకూ బీఆర్ఎస్ గురించి కేసీఆర్ బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేశ ప్రజలందరి ముందే తన ఆలోచనలు.. జెండా, అజెండా ప్రకటించాలనుకుకుంటున్నారు. డిసెంబర్ 9వ తేదీ దాని కోసం ముహుర్తం అనుకున్నట్లుగా గతంలో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణలో దర్యాప్తు సంస్థలు ఒకరి తర్వాత ఒకరు టీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తున్నాయి. ఈ అంశంపైనా కేసీఆర్ దృష్టి సారించాల్సి వస్తోంది. 


జాతీయ దర్యాప్తు సంస్థల దూకుడును అడ్డుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు !


కేసీఆర్ రోజువారీ దినచర్యలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయి.. ఎలా ఎదుర్కోవాలి.... పార్టీ నేతలకు ఎలా భరోసా ఇవ్వాలన్న అంశంపైనే ఎక్కువగా సమాలోచనలు జరుపుతున్నారు. బీజేపీ దర్యాప్తు సంస్థలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా..  టీఆర్ఎస్ చేతిలో ఎమ్మెల్యేలకు ఎర కేసు ఉంది. ఈ కేసు విషయంలో ఆయన బీజేపీ పెద్దలకు షాకిచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. స్వయంగా కేసీఆర్ ఈ కేసు దర్యాప్తుపై అప్ డేట్స్ తెలుసుకుని ప్రత్యేకమైన సూచనలు ఇస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో.. ఐటీ, ఈడీ దాడుల వ్యవహారాలను తెలుసుకుని.. పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్ లిస్ట్‌లో తర్వాత ఎవరు ఉన్నారు.. వారెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో బీజీగా ఉండటంతో  బీఆర్ఎస్‌పై జరగాల్సినంత మేథోమథనాన్ని జరపలేకపోతున్నారని అంటున్నారు. 


ఢిల్లీలో అందర్నీ సమన్వయం చేసుకునేదెప్పుడు ?


టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన వెంటనే.. వివిధ రాష్ట్రాల ఇంచార్జులను ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలపై ఓ స్పష్టత వచ్చింది. రైతు సంఘాల నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చిన్న పార్టీలతో కలిసి నడుస్తారు. అయితే ఇలాంటి వారందరితో కేసీఆర్ ఢిల్లీలో  చర్చలు జరపాల్సి ఉంది. ఇందు కోసం ఆయన ఢిల్లీ వెళతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. 


డిసెంబర్‌ 5న ప్రధానితో భేటీకి వెళ్తారా ?


డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం ఉంది. జీ 20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తోంది.  ప్రధాని మోదీ ఈ నాయకత్వాన్ని .. ప్రపంచంలో భారత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేలా చేయాలనుకుంటున్నారు. అందు కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్‌కూ కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి.. ఆహ్వానించారు. అయితే మోదీతో సమావేశం అంటే.. కేసీఆర్ ఇటీవలి కాలంలో పూర్తి స్థాయిలో దూరం పాటిస్తున్నారు. ఈ సమావేశానికీ వెళ్లరని భావించవచ్చు. అయితే ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్లే అవకాశం ఉండొచ్చంటున్నారు.