CM KCR Tour:  కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ల సముదాయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపెల్లి కి 29న, జగిత్యాల జిల్లాకు సెప్టెంబర్ 10న రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు తెగ ఆరాట పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో జరిగిన సభకు జనం తక్కువగా రావడంతో అలాంటి పరిస్థితి జిల్లాలో ఉత్పన్నం కాకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ జిల్లాకు చెందినవారే కావడం, వారు నేరుగా ముఖ్యమంత్రి కి సవాల్ విసరుతూ మాట్లాడుతూ ఉండడం టిఆర్ఎస్ కు మింగుడుపడడం లేదు.


ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేలా.. 
యాత్రలో అరెస్ట్ అయి ఇటీవల ఒక రోజు గృహ నిర్బంధంలో ఉండి నిరసన దీక్ష చేపట్టిన బండి సంజయ్.. బీజేపీ శ్రేణులను పెద్ద ఎత్తున హాజరయ్యేలా చేసి ఒక ప్రత్యేక రాజకీయ వాతావరణాన్ని కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ తామే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా పాతుకుపోయేలా చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో సీఎం కేసీఆర్ పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కలెక్టర్ సముదాయాలను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సభను విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమ ఊపిరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కు ఢోకా లేదని, ఎప్పుడు ఎలక్షన్ జరిగిన విజయం తమదేనని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంది. 


పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలకు బాధ్యతల అప్పగింత..! 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి  ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, జగిత్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ద్యావ వసంత తదితర సంస్థల నామినేటెడ్ చైర్మన్ లు, డైరెక్టర్లు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అధికార పార్టీ పదవుల్లో ఉన్న నేతలను సమన్వయ పరుస్తూ వారికి బాధ్యతలు అప్పగించి సీఎం పర్యటన విజయవంతానికి తెగ కష్టపడుతున్నారు. ఈ రెండు సభలకు కూడా లక్షన్నర మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాలని నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.


లక్ష మందిని సమీకరించాలని నిర్ణయం.. 
ఈ నెల 29న పెద్దపెల్లి జిల్లాలో జరగనున్న సీఎం కేసీఆర్ సభకు జన సమీకరణ బాధ్యతలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల నుంచి లక్ష మందిని సమీకరించాలని నిర్ణయించారని తెలిసింది. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి 25 వేల మందిని తరలించేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ గెల్లు శ్రీనివాస్, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కె విజయ కు బాధ్యతలు అప్పగించారు.