Telangana Small Parties :  తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.  టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయం తమదేనని అంటున్నాయి. అయితే ఈ మూడు పార్టీలు మాత్రమే కాదు ఇంకా  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ,   బీఎస్పీ కూడా తాము రేసులో ఉన్నామంటోంది. జనసేన కూడా పరిమిత స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. పంజాబ్ గెలుపుతో ఊపుమీదున్న ఆప్, కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ వచ్చే ఎన్నికలలో బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రెడీగా ఉన్నాయి.ఈ పార్టీలు గెలుస్తాయని కాదు కానీ వేరే పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. 


ఎన్నికల వ్యూహాల్లో ప్రధాన పార్టీలు !


 టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అప్పుడే  ఓటర్లను ఆకర్షించే ఎజెండాలను, నియోజకవర్గాలలో గెలుపు గుర్రాలను తయారు చేసుకునే పనిలో పడ్డాయి. జన సమీకరణ సభలను నిర్వహిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికతో వారు సెమీ ఫైనల్‌ను దాటాలనుకుంటున్నారు. ఇప్పటికే సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరి ఓటు బ్యాంకు ఎంత? ఏ సామాజికవర్గాల ప్రాబల్యం ఎంతుంది? ఏ వర్గాల నుంచి తమకు మద్దతు లభిస్తుంది? ఏ వర్గాలు ప్రత్యర్థి శిబిరం వైపు ఉంటాయి? వగైరా విషయాలపై వివరాలు సేకరిస్తున్నాయి.మొత్తం 119 స్థానాలకు 110 స్థానాలలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడు పార్టీల అభ్యర్థులే నేరుగా తలపడబోతున్నారు. మిగిలిన చిన్నపార్టీల అభ్యర్థుల పాత్ర   విజయావకాశాలను ప్రభావితం చేయడం మేరకే ఉంటుంది. 


వైఎస్ఆర్‌టీపీ వల్ల ఎవరికి నష్టం !?
 
వైఎస్సార్‌టీపీkf దివంగత వైఎస్ అభిమానులే ప్రధాన ఓటుబ్యాంక్. అయితే  అాలాంటి వారు తెలంగాణలో ఉన్నారా అన్నది ఇప్పుడుకీలకమైన  ప్రశ్న.  పార్టీ పెట్టినప్పటి నుంచీ అధినేత్రి షర్మిల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. పాదయాత్ర సైతం చేపట్టారు.   వచ్చిన తెలంగాణను కేసీఆర్ స్వార్థానికి వాడుకుంటున్నారని, రాజన్న రాజ్యం వస్తే తప్ప ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం కావని ఆమె చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో ఈ పార్టీ మిగతా పార్టీల విజయావకాశాలను దెబ్బతీయవచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి.  ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే చీలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.


బీఎస్పీని తక్కువ అంచనా వేయలేం ! 
 
సమర్థుడైన పోలీసు అధికారిగా, గురుకులాల కార్యదర్శిగా పేరు తెచ్చుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన సర్వీసుకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు.  33 జిల్లాలలో విస్తరించి ఉన్న 40 లక్షలకు పైగా స్వేరోలు, మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఈ పార్టీకి ప్రధాన బలంగా ఉన్నారు. ఇప్పటిదాకా ఈ వర్గాలు అయితే అధికార టీఆర్ఎస్‌కో లేదంటే కాంగ్రెస్ పార్టీకో ఓటు వేస్తూ వస్తున్నాయి. ఈ కోణంలో చూస్తే, వచ్చే ఎన్నికలలో బీఎస్పీ పోటీ చేసే సెగ్మెంట్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశముంది.  


జనసేన సహా ఇతర పార్టీల వల్ల ఎవరికి నష్టం ! ?


 జనసేన పార్టీ ప్రస్తుతంబీజేపీతో పొత్తులో ఉంది.  కానీ బీజేపీ ఆపార్టీకి సీట్లు కేటాయించే అవకాశం లేదు. కాబట్టి జనసేన తమను నమ్ముకున్న నేతల కోసం అయినా పోటీ చేసే అవకాశం ఉంది.  పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ యువతలో పెద్దయెత్తున అభిమానులున్నారు. పవన్ చెప్పింది విని వీరిలో ఎంతమంది జనసేనకు ఓటేస్తారన్నది ప్రశ్నార్థకమే అయినా, పడే ఓట్లు మాత్రం సాధారణంగా మూడు ప్రధాన పార్టీల ఓట్లనూ సమానంగా చీల్చవచ్చు. ఇక టీడీపీ సానుభూతి పరుల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని ఓట్లు చీలుస్తుంది.  రాజకీయాల్లో గెలుపునకు.. ఓటమికి తేడా ఒక్క ఓటే. ఆ ఒక్క ఓటును ఇతర పార్టీలు  చీలిస్తే గెలుపోటములు తారుమారవుతాయి. క్లిష్టమైన పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తున్న తెలంగాణలో ఈ సారి ఈ పార్టీలు చీల్చే ఓట్లే ప్రధాన పార్టీల జాతకాన్ని మార్చబోతున్నాయి.